Friday, January 16, 2026
HomeTop StoriesMedaram Jatara: ఆదివాసీల కుంభమేళా.. వీర వనితల వీరగాథ!

Medaram Jatara: ఆదివాసీల కుంభమేళా.. వీర వనితల వీరగాథ!

Medaram Sammakka Sarakka Jatara : రాచరికపు అహంకారంపై ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక.. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా కోట్లాది మంది విశ్వాసం.. అదే మేడారం సమ్మక్క-సారలమ్మల మహాజాతర! ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న మేడారం, నేడు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాకు వేదికగా మారింది. రెండేళ్లకోసారి జరిగే ఈ అద్భుత ఘట్టం వెనుక ఉన్న వీరోచిత చరిత్ర ఏంటి? ఈ జాతర ప్రాముఖ్యత, దాని ప్రధాన ఘట్టాలేంటి?

- Advertisement -

వీర వనితల వీరగాథ : ఈ జాతర వెనుక దాదాపు 900 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం, కాకతీయ సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న ఆదివాసీ దొర పగిడిద్దె రాజు, కరువు కారణంగా కప్పం కట్టలేకపోతాడు. ఆగ్రహించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు, మేడారంపై యుద్ధం ప్రకటిస్తాడు. ఆ భీకర యుద్ధంలో పగిడిద్దె రాజు, ఆయన కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందుతారు. వారి భార్య, పగిడిద్దె రాజు భార్య అయిన సమ్మక్క, కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడి, తీవ్ర గాయాలతో చిలుకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమవుతుంది. వెతుక్కుంటూ వెళ్లిన ఆదివాసీలకు, ఆమె ఓ కుంకుమ భరిణె రూపంలో దర్శనమిస్తుంది. ఆ వీరవనితల త్యాగానికి గుర్తుగా, వారిని దేవతలుగా కొలుస్తూ, ఆదివాసీలు ఈ జాతరను ప్రారంభించారు.

జాతర ఘట్టాలు.. గిరిజన సంప్రదాయాలు : రెండేళ్లకోసారి, మాఘశుద్ధ పౌర్ణమికి ముందు బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది.

తొలి రోజు: సారలమ్మ, పగిడిద్దె రాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకువస్తారు.
రెండో రోజు: సమ్మక్క తల్లి ఆగమనం. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇదే జాతరలో అత్యంత కీలక ఘట్టం.

మూడో రోజు: అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై కొలువుదీరి, భక్తులకు దర్శనమిస్తారు.
నాలుగో రోజు: అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ జాతర ఆద్యంతం గిరిజన పూజారులే, తమ సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించడం విశేషం.

స్వరాష్ట్రంలో అభివృద్ధి.. రూ.300 కోట్లతో కొత్త హంగులు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సరైన గుర్తింపునకు, అభివృద్ధికి నోచుకోని మేడారం, తెలంగాణ ఏర్పడ్డాక కొత్త శోభను సంతరించుకుంది. ఈ ఏడాది జాతరకు కోటికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం, రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు చేస్తోంది.

గద్దెల ప్రాంగణంలో రూ.200 కోట్లతో శాశ్వత రాతి నిర్మాణాలను చేపట్టింది. ఈ నిర్మాణాలపై ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా చిత్రాలను చెక్కారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పునరుద్ధరణ పనులను ప్రారంభించనున్నారు. తెలంగాణ నుంచే కాకుండా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా వంటి రాష్ట్రాల నుంచి లక్షలాది మంది గిరిజనులు, గిరిజనేతరులు ఈ జాతరకు తరలివచ్చి, వనదేవతలను దర్శించుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News