HomeTop StoriesMedha Patkar: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలి.. సీఎంకు మేధా పాట్కర్ లేఖ!

Medha Patkar: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలి.. సీఎంకు మేధా పాట్కర్ లేఖ!

Musi project: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ (స్టేజ్-1)ను నిలిపివేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ (NAPM) ప్రతినిధి మేధా పాట్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 13న నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి రద్దు చేయాలని కోరింది. బాధితులతో పాటుగా పౌర సమాజంతో సమగ్రంగా చర్చించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఆమె బుధవారం ఇ-మెయిల్ ద్వారా లేఖ రాశారు.

- Advertisement -

ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలు అవసరం: మూసీ జన ఆందోళన్ తరఫున లేఖ రాస్తున్నట్లు పేర్కొన్న మేధా పాట్కర్.. ప్రాజెక్ట్ అమలుకు ముందు ప్రభావిత ప్రజలు, పౌర సమాజ సంస్థలతో ప్రత్యక్షంగా సంప్రదింపులు జరపాలని తెలిపారు. పారదర్శకమైన సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.

విధ్వంసం వద్దు: అభివృద్ధి పేరుతో వేలాది కుటుంబాలను రోడ్డున పడేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పట్టణ కార్మిక వర్గం, మధ్యతరగతి ప్రజలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ జీవితకాల పొదుపుతో నిర్మించుకున్న ఇళ్లు కోల్పోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం నివాసాలే కాకుండా హైకోర్టు వంటి వారసత్వ కట్టడాలకు సైతం ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రమాదం పొంచి ఉందని ఆమె హెచ్చరించారు.

గత వైఫల్యాలే గుణపాఠం: గతంలో సబర్మతి రివర్‌ఫ్రంట్ వంటి ప్రాజెక్టులు ఎదుర్కొన్న చట్టపరమైన, పర్యావరణ చిక్కులను మేధా పాట్కర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 1990ల నుండి మూసీ ప్రాజెక్ట్ ప్రజా నిరసనల కారణంగానే ఆగిపోయిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బలవంతపు కూల్చివేతలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే కూల్చివేసిన 300 ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యామ్నాయ గృహాలు ప్రజల జీవనోపాధికి, వారి సామాజిక అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని లేఖలో వివరించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News