Meta sensational decision on Layoffs: సాఫ్ట్‌వేర్ రంగంలో లేఆఫ్స్‌ల పరంపర కొనసాగుతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫారమ్‌ల మాతృసంస్థ మెటా మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు (Layoffs) సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పోటీ మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో, మెటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. దీంతో, ఈ లేఆఫ్ కారణంగా సుమారు 8 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మే 20 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా, అదే సమయంలో దాదాపు 6 వేల పోస్టుల ఫ్రెషర్స్ నియామకాలను కూడా నిలిపివేయనుంది. ఏఐ ఆధారిత కార్యకలాపాలను విస్తరిస్తూ, కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెటా స్పష్టం చేసింది.
Also Read: https://teluguprabha.net/top-stories/sit-notices-to-bandi-bhagirath/
ఉద్యోగం కోల్పోయేవారికి మెరుగైన ప్యాకేజీ..
ఈ భారీ లేఆఫ్స్‌లకు సంబంధించి మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ ఉద్యోగులకు ఇంటర్నల్ మెమో పంపారు. సంస్థలో సంస్థాగత మార్పులు జరుగుతున్నాయని లేఖలో వివరించారు. లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయే వారికి మెటా జీతాల చెల్లింపుతో పాటు కుటుంబానికి 18 నెలల ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీ ఇవ్వనుంది. మెటా తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ టెక్ ఉద్యోగులపై భారీ ప్రభావం చూపనుంది. దేశీయంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇంజినీరింగ్, ఆపరేషన్స్, కంటెంట్ మోడరేషన్ టీమ్‌లలోని వందలాది మంది లేఆఫ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

