Meteorological Department: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. నేడు ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక: ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడుతో పాటు మరిన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని పేర్కొంది. శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో తేలికపాటి వానలు: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Also read-Telangana: వర్షాకాల సన్నద్ధతపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ప్రజలకు అత్యవసర సూచనలు: ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు ప్రారంభం కాగానే ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. బయట ఉన్నవారు పొరపాటున కూడా చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇనుప హోర్డింగ్స్ కింద నిలబడకూడదని అధికారులు తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటికి వీలైనంత దూరంగా ఉండాలని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆ సమాచారాన్ని సమీపంలోని అధికారులకు సమాచారం అందించాలని వాతావరణ శాఖ కోరింది.

