Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న వరంగల్ వార్ ఇప్పుడు టీపీసీసీ చీఫ్ వద్దకు చేరింది. ఇవాళ ఉదయం మంత్రి కొండ సురేఖ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కడియం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సురేఖ: మంత్రి కొండా సురేఖ ఇవాళ ఉదయం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో భేటీ అయ్యారు. తనశాఖకు సంబంధించిన వివాదంతో పాటు ప్రస్తుత వరంగల్ రాజకీయ పరిణామాలపై కొండ సురేఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన పరిధిలోని దేవాదాయ శాఖ అంశాలపై తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్షా సమావేశం నిర్వహించడాన్ని తప్పుపట్టారు. ఇది పూర్తిగా ప్రొటోకాల్ ఉల్లంఘనేనని టీపీసీసీ చీఫ్‌కు వివరించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి నుంచి తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మహేశ్ కుమార్ గౌడ్‌తో చర్చించారు. పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్న కడియం శ్రీహరిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై తాను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు కొండా సురేఖ స్పష్టం చేశారు.
Also read-Harish Rao: “రేవంత్, ఉత్తమ్‌లను ఉరి తీసినా తప్పులేదు”
ఎంతటి వారినైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు: మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య నడుస్తున్న గ్రూప్ రాజకీయాలపై తాము ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ వివాదానికి ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వంతో పాటు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సరే.. ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ ఈ సందర్భంగా కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

