రాయచోటి టౌన్, (తెలుగు ప్రభ) : రాయచోటిలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.మంత్రి కదలికలను గమనిస్తూ మూడు రోజులుగా కాపు కాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంతర్రాష్ట్ర ముఠా శనివారం మారణాయుధాలతో పట్టుబడటం ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తోంది.
రివాల్వర్లు, పిస్టళ్లు,బుల్లెట్లతో సహా ఆయుధాలు స్వాధీనం చేసుకుని 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.స్థానిక ఎన్నికల ప్రశాంతతను దెబ్బతీసి,రాజకీయ ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నానికి కుట్ర చేసినట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని పలువురు కోరుతున్నారు.

ఢిల్లీ, హైదరాబాద్,పంజాబ్ వంటి ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చినట్లు చెబుతున్న ఈ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో పోలీసులు నిగ్గు తేల్చాల్సివుంది.అక్రమ ఆయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను ఉపేక్షించకూడదని,ఈ ఘటనలో బాధ్యులుగా తేలిన వారందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

