Paddy procurement: అన్నదాతలకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను ఈ నెల15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.
రికార్డు స్థాయిలో కొనుగోళ్లు: రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోందని మంత్రి తెలిపారు. యాసంగి సీజన్‌లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 70.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ధాన్యం విక్రయాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతి గింజనూ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
Also read-Ponguleti: తెలంగాణలో పెరిగిన భూముల మార్కెట్ వాల్యూ.. రేపటి నుంచే అమలు!
ఆ 5 జిల్లాలపై ప్రత్యేక ఫోకస్: రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, ధాన్యం నిలువలు ఇంకా ఎక్కువగా ఉన్న 5 జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ.. పారదర్శకంగా ప్రక్రియ ముగిసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

