BRS Mock Assembly in Telangana Bhavan : శాసనసభ వేదికగా విపక్ష గొంతు నొక్కేశారన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సభ నుంచి గులాబీ దళాన్ని మూకుమ్మడిగా సస్పెండ్ చేసిన వేళ, ప్రతిపక్షం ఊహించని సరికొత్త ప్రజాపోరాటానికి తెరతీసింది. సభలో మాట్లాడే అవకాశం దక్కకపోతేనేం.. ప్రజాక్షేత్రంలోనే ప్రజాసమస్యలను ఎండగడతామంటూ తెలంగాణ భవన్ వేదికగా నేడు ‘మాక్ అసెంబ్లీ’ కొలువుదీరనుంది.
సరికొత్త పాత్రల్లో గులాబీ ఎమ్మెల్యేలు : తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఈ వినూత్న సభలో బీఆర్ఎస్ శాసనసభ్యులే అధికార, ప్రతిపక్ష పాత్రలు ధరించి అసెంబ్లీ వాతావరణాన్ని తలపించేలా చర్చించనున్నారు.
సభాపతి (స్పీకర్): జహీరాబాద్ ఎమ్మెల్యే కౌకుంట్ల మాణిక్ రావు
ముఖ్యమంత్రి: మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
కీలక మంత్రులు: ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్
వైఫల్యాలపై నిలదీత.. ప్రజా సమస్యలపై చర్చ : సభలో ప్రధానంగా విద్యార్థులను వేధిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్న 22-ఏ (22A) భూ వివాదాలు, కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై సుదీర్ఘంగా చర్చ చేయనున్నారు. అసెంబ్లీ ముట్టడి నిరసనల క్రమంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల దురుసు ప్రవర్తన, అక్రమ కేసుల నమోదు అంశాలను తీవ్రంగా ఖండించనున్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డ నేతలు, ప్రజాపక్షాన తమ గళాన్ని వీధివీధినా వినిపిస్తామని ఈ మాక్ అసెంబ్లీ వేదికగా హెచ్చరించనున్నారు.

