Tirupati tragedy: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త జులాయిగా మారి అప్పుల ఊబిలోకి నెట్టడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత దారుణ నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు చిన్నారులను ఉరివేసి చంపింది. అనంతరం తాను కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన తిరుపతి జిల్లా పుత్తూరులో విషాదం నింపింది.
ప్రేమ వివాహం.. పెను విషాదం: పోలీసుల కథనం ప్రకారం నేషనూరుకు చెందిన పద్మ (28), శివశంకర్ డిగ్రీ చదువుకునే రోజుల నుంచి ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పాటు శివశంకర్ ప్రవర్తన సరిగ్గా లేదని పద్మ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. అయినా వారిని కాదని 2019లో పద్మ అతడిని వివాహం చేసుకుంది. వీరికి తేజ (6), లాస్య (5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అప్పుల బాధ.. బాధ్యత లేని భర్త: పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నా తర్వాత శివశంకర్ జులాయిగా తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజుల కోసం పద్మ డ్వాక్రా సంఘాల్లో అప్పులు చేయాల్సి వచ్చింది. శనివారం డ్వాక్రా అప్పు కట్టాలని భర్తను అడగ్గా అతను కట్టలేనని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఇక బతకటం కంటే మరణమే మేలని కఠిన నిర్ణయం తీసుకుంది. తాను చనిపోతే తన బిడ్డల పరిస్థితి దారుణంగా ఉంటుదని భావించిన పద్మ.. తన పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది.
ప్రతి ఒక్కరికీ నా జీవితం ఒక గుణపాఠం: ఆత్మహత్యకు ముందు పద్మ రాసిన సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. “తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి తన భర్తకు ఉండకూడదని కోరుకునే అన్ని దుర్లక్షణాలు నా భర్తలో ఉన్నాయి. నేను చనిపోయాక ఎలాగూ ఇంకో పెళ్లి చేసుకుంటావు.. కనీసం అప్పుడైనా లైఫ్ లో సెటిల్ అయ్యాక చేసుకో.” అంటూ ఆమె రాసిన లేఖ ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.
ఘటన జరిగిన తీరు: భర్త బయటకు వెళ్లిన సమయంలో పద్మ బెడ్‌రూమ్‌లో ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపింది. తర్వాత హాల్‌లో తాను ఉరివేసుకుంది. సాయంత్రం భర్త, తండ్రి వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ రవికుమార్ భర్త శివశంకర్‌పై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

