MP Arvind: కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. బండి భగీరథ్‌కు సంబంధించిన ఒక కేసులో బాధితురాలి కుటుంబం వెనుక ఉండి తానే నడిపిస్తున్నాననే ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. “నాకు ఆ బాధితురాలి కుటుంబం ఎవరో అస్సలు తెలియదు. భగీరథ్‌ను నేను ఎప్పుడూ కలవలేదు కూడా. అయినా నాపై ఇలాంటి దుష్ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు” అని పేర్కొన్నారు. అంతేకాకుండా బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి.. ఆ స్థానంలోకి తాను వెళ్లాలని చూస్తున్నాననే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. తనకు ఇప్పుడున్న ఎంపీ పదవితోనే పూర్తి సంతృప్తిగా ఉన్నానని ఆయన వివరించారు.
రేవంత్ సర్కార్‌పై మండిపడ్డ అరవింద్: నిజామాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు అంశంలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ అరవింద్ మండిపడ్డారు. 1987 నుంచి పసుపు బోర్డు కోసం ఇక్కడి రైతులు పోరాటాలు చేస్తున్నారని అన్నారు. తాను ప్రత్యేకంగా పట్టుబట్టి కేంద్రం ద్వారా దీనిని సాధిస్తే.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకుండా అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలో భేదాభిప్రాయాలు సహజం: ఒకే పార్టీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడం సహజమేనని అరవింద్ అభిప్రాయపడ్డారు. గతంలో మునుగోడు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో తాను పార్టీ నిర్ణయాలతో కొన్ని విభేదించాను తప్ప.. పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేయలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

