Municipal elections: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నికల నగారా త్వరలోనే మోగనుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. ఈ నెల(జనవరి) 16న పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటరు జాబితాను ప్రదర్శించే అవకాశం ఉంది. అనంతరం జనవరి 17న ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా అధికార పార్టీ వర్గాలు వెళ్లడించాయి. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసి.. 14న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తుంది.
తెలిన రిజర్వేషన్ల లెక్క: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన ‘బూసాని వెంకటేశ్వరరావు’ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. గతంలో 42 శాతం అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ.. న్యాయపరమైన చిక్కుల దృష్ట్యా 32 శాతానికే పరిమితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి లోపు ఉంచనున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ రిజర్వేషన్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 12 లేదా 13 తేదీల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ రిజర్వేషన్లకు ఆమోదం తెలపనున్నట్లుగా సమాచారం.
Also read-Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బ్యాలెట్ పేపర్‌తోనే మున్సిపల్ ఎన్నికలు!
123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు: రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం 2,996 వార్డుల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం గడువు ముగిసిన వాటితో పాటు.. మరికొన్ని కార్పొరేషన్లను రద్దు చేసి లేదా రాజీనామాలు చేయించి అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుబాటులో ఉన్న పోలీసు బలగాలు, సిబ్బందితో ఒకే రోజున పోలింగ్ నిర్వహించడం సాధ్యమని అధికారులు నిర్ధారణకు వచ్చారు.
బ్యాలెట్ విధానంలోనే పోలింగ్: సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వాడుతుంటారు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం బ్యాలెట్ పద్ధతికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈవీఎంలపై కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ.. ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకమని నిరూపించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ వైపు మొగ్గుచూపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతి సులభమని, క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించడం సులభమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఎన్నికల నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ. 85 కోట్లు విడుదల చేయాలని పురపాలక శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది.

