Uttar Pradesh Crime: ఒక తండ్రి తన కుమారుడిపై మాత్రమే ప్రేమ చూపించి, కూతుళ్లను తక్కువగా చూసుకుంటే ఆ ఇంటి వాతావరణం ఎలా మారుతుంది… ఆ మనసుల్లో ఎంత కసి పేరుకుపోతుంది… చివరకు అది ఎంత భయంకర పరిణామానికి దారితీస్తుంది… అన్న దానికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన కఠిన ఉదాహరణగా నిలిచింది. కుమారుడికి ఒకలా, కూతుళ్లకు మరోలా ప్రవర్తించాడనే ఆరోపణల మధ్య, 60ఏళ్ల తండ్రి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఉత్తరప్రదేశ్‌లోని Muzaffarnagar జిల్లాలో ఈ దారుణం జరిగింది. 32ఏళ్ల పెద్ద కుమార్తె, 16ఏళ్ల చిన్న కుమార్తె కలిసి తమ తండ్రిని హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తండ్రి తన కుమారుడిని మాత్రమే ప్రోత్సహించేవాడని, తమను మాత్రం ఎప్పుడూ మందలించేవాడని, పెళ్లి కాలేదని, ఇంట్లోనే ఉన్నారని తరచూ అవమానించేవాడని వారు విచారణలో చెప్పినట్టు సమాచారం. సంవత్సరాలుగా పేరుకుపోయిన ఆవేదన చివరకు నేరంగా మారిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటన జరిగిన రాత్రి ఇద్దరూ ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులందరికీ భోజనం పెట్టే సమయంలో నిద్రమాత్రలు కలిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. తల్లి సహా అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత, చిన్న కుమార్తె తండ్రి కాళ్లను పట్టుకోగా, పెద్ద కుమార్తె వంటగదిలోని కత్తితో గొంతు కోసినట్టు పోలీసుల కథనం. రక్తపు మడుగులో మృతదేహం కనిపించడంతో విషయం బయటపడింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. రెండు గంటల లోపే ఇద్దరు కుమార్తెలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో వారు నేరాన్ని ఒప్పుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కేసుపై స్పందించిన Aditya Bansal, కుమార్తెలు తమ తండ్రి వివక్ష ప్రవర్తనపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారని చెప్పారు. కుమారుడికి ప్రాధాన్యం ఇచ్చి, కుమార్తెలను తరచూ మందలించేవాడని వారు ఆరోపించారని వెల్లడించారు.
సంఘటనా స్థలం నుంచి నిద్రమాత్రల స్ట్రిప్‌లు, హత్యకు ఉపయోగించినట్టు భావిస్తున్న కత్తి, రక్తపు మచ్చల బట్టలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు Bhopa Police Station లో నమోదు అయింది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 కింద హత్య కేసు నమోదు చేసి, ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారిని న్యాయ కస్టడీకి రిమాండ్ చేసింది. ఒక కుటుంబంలో సమానత్వం లేకపోతే, ప్రేమలో తేడా ఉంటే, సంభాషణ లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఈ ఘటన స్పష్టంగా చెబుతోంది. సమస్యలు ఎంత పెద్దవైనా చట్టం చేతిలోకి తీసుకోవడం పరిష్కారం కాదనే సందేశాన్ని కూడా ఇది ఇస్తోంది.

