Navpreet Singh deportation to India : అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తూ, తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ నేరగాడి ఆట కట్టిందిm అఫ్గానిస్థాన్ కేంద్రంగా భారత్‌లోకి విషాన్ని నింపుతూ, విదేశీ గడ్డపై నకిలీ ముసుగులో దర్జాగా తలదాచుకున్న ఆ కింగ్‌పిన్ భారత నిఘా పంజరం నుంచి తప్పించుకోలేకపోయాడు.
కరడుగట్టిన నార్కోటిక్స్ స్మగ్లర్ నవప్రీత్ సింగ్‌ను తుర్కియే నుంచి విజయవంతంగా భారత్‌కు తీసుకువచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. నవప్రీత్ సింగ్ ‘నవాబ్ విర్క్’ అనే నకిలీ పేరుతో దొంగ ధ్రువపత్రాలు సృష్టించి తుర్కియే పౌరసత్వాన్ని పొందాడు. అనంతరం, తన ముఠా సాయంతో అఫ్గానిస్థాన్ నుంచి భారతదేశానికి హెరాయిన్, మెథాంఫేటమిన్ వంటి ప్రమాదకర మత్తుపదార్థాలను పెద్దఎత్తున అక్రమ రవాణా చేసేవాడు.
భారత నిఘా సంస్థలు అహర్నిశలు శ్రమించి, అతడి నకిలీ ఆనవాళ్లను ఛేదించి అసలు స్వరూపాన్ని బట్టబయలు చేశాయి. పక్కా ఆధారాలు సమర్పించడంతో తుర్కియే అతడిని బహిష్కరించి (డిపోర్ట్) మన దేశానికి అప్పగించింది. భారత్‌కు చేరిన వెంటనే అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. డిసెంబర్ 2029 నాటికి దేశంలోని మాదకద్రవ్యాల ముఠాలను సమూలంగా కూకటివేళ్లతో పెకిలించి వేయడమే మోదీ సర్కార్ లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు.

