NEET UG 2026 Exam Cancelled: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ- 2026 పరీక్ష రద్దు చేసింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పరీక్షను రద్దు చేసినట్లు పేర్కొంది. త్వరలోనే నీట్ యూజీ పరీక్ష కొత్త తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది.
రాజస్థాన్‌లో పేపర్ లీక్: నీట్ యూజీ-2026కు సంబంధించి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది. పరీక్షకు ముందు రాజస్థాన్‌లో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్‌తో ప్రశ్నా పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలకు సంబంధించిన అంశాలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 3న జరిగిన పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును.. కోచింగ్ సెంటర్‌లో గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్, ఎస్‌ఓజీ అధికారులు తెలిపారు. ఈ మెటీరియల్ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చినట్లు పోలీస్ అధికారి నిర్ధారించారు. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ- 2026 పరీక్ష రద్దు చేసింది.

