Neha Bora: కొన్ని రోజులుగా సోషల్ మీడియా తెరిస్తే చాలు.. ఎక్కడ చూసినా ఒకటే పేరు. అదే.. నేహా బోరా.. పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు, బారికేడ్లు ఎక్కుతున్న ఫోటోలు, మైక్ అందుకుంటే ప్రశ్నల వర్షం కురిపించే ప్రసంగాలు.. ఇలా ఆమెకు సంబంధించిన ప్రతి వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది. అసలు ఎవరీ నేహా బోరా? ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎందుకింత చర్చనీయాంశంగా మారారు?
ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వరకు..
నేహా బోరా ఉత్తరాఖండ్‌లోని ఖతీమాకు చెందిన విద్యార్థి. తండ్రి భారత సైన్యంలో పనిచేయడంతో చిన్నతనంలో వివిధ ప్రాంతాల్లో పెరిగారు. పాఠశాల విద్యను పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో కొనసాగించారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కళాశాలలో సోషియాలజీ చదివారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో థియేటర్ అండ్ పెర్ఫార్మెన్స్ స్టడీస్‌లో పరిశోధన చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమెకు అదే అనుభవం ప్రజల ముందు మాట్లాడే నైపుణ్యాన్ని పెంచిందని పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు.
నటన నుంచి విద్యార్థి ఉద్యమాల వైపు..
నేహా ప్రయాణం కేవలం చదువుకే పరిమితం కాలేదు. 2019-20లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొనడంతో ఆమె సామాజిక ఉద్యమాల వైపు అడుగులు వేశారు. అనంతరం అఖిల భారత విద్యార్థి సంఘం (AISA)లో చురుగ్గా పనిచేస్తూ జాతీయ అధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగం, పరీక్షా పత్రాల లీకేజీలపై గళమెత్తుతూ వచ్చారు. ఈ ఏడాది నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో జరిగిన ఆందోళనల్లోనూ ఆమె కీలకంగా కనిపించారు. జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి 23 రోజుల నిరాహార దీక్షలో పాల్గొనడం ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది.
పోలీసుల నిర్బంధం.. సోషల్ మీడియాలో సంచలనం!
ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ యువత చేపట్టిన ఆందోళనల్లో నేహా ముందువరుసలో నిలిచారు. ఢిల్లీలో పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడం, నేహా బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడం, పోలీసుల అదుపులోకి వెళ్లిన సందర్భాల్లోనూ నినాదాలు కొనసాగించడం వంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో విద్యార్థి ఉద్యమాలతో దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగుతోంది.

