Nitish Takes Oath CM For Tenth Time: బిహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది ఆయన పదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం. బుధవారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో నితీశ్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం నితీశ్ కుమార్‌తో కూడిన ఎన్డీయే సీనియర్ నేతల బృందం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలిశారు. తన రాజీనామాను సమర్పించి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు నితీశ్ అందజేశారు. అయితే నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినప్పటికీ.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సూచించారు.
పదోసారి ప్రమాణ స్వీకారం: నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో జరగనుంది. నితీశ్‌తో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటుగా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
బీజేపీ శాసనసభాపక్ష నేతగా సామ్రాట్: బిహార్ బీజేపీశాసనసభాపక్ష నేతగా మాజీ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి ఎన్నికయ్యారు. శాసనసభాపక్ష ఉప నేతగా విజయ్ కుమార్ సిన్హాను ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ ఎన్నికల పరిశీలకుడు కేశవ్ ప్రసాద్ మౌర్య తెలియజేశారు. దీంతో మరోసారి సామ్రాట్ చౌధరి డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది.

