HomeTop StoriesNTR: దీని వెనుక ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టను: ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

NTR: దీని వెనుక ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టను: ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

NTR Warning: సాంకేతికత ఓ వైపు కొత్తపుంతలు తొక్కుతుంటే…దానిని సమాజ వికాసానికి, అభివృద్ధికి వినియోగించాల్సింది పోయి, కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వివిధరంగాలలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని అసభ్యకర మార్ఫింగ్ వీడియోలను క్రియేట్ చేసి, సెలెబ్రిటీల వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని కొందరు దెబ్బతీస్తున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం రెండేళ్ల క్రితం విడుదలై, ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఆ చిత్రంలోని పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచి, ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరింపజేశాయి. ప్రత్యేకించి ‘చుట్టమల్లే’ అనే మెలోడీ ట్రాక్ అప్పట్లో విడుదలైన వెంటనే రికార్డు వ్యూస్‌తో సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. అయితే ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ సాంగ్ చుట్టూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేదికగా సరికొత్త వివాదం తలెత్తింది. ఈ సాంగ్ లోని హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ అభినయానికి సంబంధించిన ఒరిజినల్ సన్నివేశాలను కొందరు వ్యక్తులు అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి, ఆ వీడియోలను నెట్టింట వదిలారు. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది.

మార్ఫింగ్ వీడియోలను..

ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల హావభావాలను పూర్తిగా వక్రీకరించారు. అసలు ఒరిజినల్ పాటలో లేని రొమాంటిక్ సీన్లు, అసభ్యకరమైన దృశ్యాలను ఆ వీడియోలలో సృష్టించి సోషల్ మీడియాలో వదలడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ మార్ఫింగ్ వీడియోలను చూసిన సగటు నెటిజన్లు నిజంగా ఇవి సినిమాలోని సన్నివేశాలేనని భ్రమపడే అవకాశం లేకపోలేదు. ఇలాంటి హేయమైన చర్యల వల్ల సెలబ్రిటీల వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవానికి తీవ్ర భంగం వాటిల్లే పరిణామాలు ఏర్పడుతున్నాయని అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.
ఇదిలావుండగా, ఈ మార్ఫింగ్ ఘటనపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే గడ్డపై ఇంతటి వికృత చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ‘మాతృదేవోభవ’ అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదు.. మన సంస్కృతి, జీవన విధానంలో అది ఒక అంతర్భాగమని ఎన్టీఆర్ తాను విడుదల చేసిన ప్రకటనలో రాసుకొచ్చారు. ఈ మార్ఫింగ్ వీడియోల వెనుక ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని, దీన్ని క్రియేట్ చేసిన వారిపైన, అలాగే ఈ వీడియోలను ఉద్దేశ్యపూర్వకంగా పోస్ట్ చేస్తున్న వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని ఎన్టీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

దయచేసి, ఇలాంటి కంటెంట్‌‌ను ఎవరూ చూడొద్దని…రేపు ఇది మీ ఇంట్లో మదర్, సిస్టర్, వైఫ్, డాటర్ వంటి వాళ్లకూ ఎదురు కావచ్చునని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నీచ ఘటనలపై కఠిన చట్టాలను అమలుపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News