HomeTop StoriesIllegal Clinics: రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోం

Illegal Clinics: రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోం

ప్యాపిలి, ( తెలుగుప్రభ ) : మెడికల్‌ షాపుల మాటున అమాయక ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తూ అక్రమంగా వైద్య కేంద్రాలు నడిపితే చూస్తూ ఊరుకోబోమని సీపీఐ మండల కార్యదర్శి మహేష్ తీవ్రంగా హెచ్చరించారు. మండలంలో పలు మెడికల్ షాపుల ముసుగులో కొందరు ఆర్‌ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా బెడ్లు ఏర్పాటు చేసి, సెలైన్లు ఎక్కిస్తూ దర్జాగా ఆసుపత్రుల తరహాలో చికిత్సలు అందిస్తున్నారంటూ వెలువడిన కథనాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం మందులు విక్రయించాల్సిన ప్రాంగణాల్లో ఎలాంటి అధికారిక అనుమతులు, సరైన అర్హతలు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తుండటం ప్రజారోగ్యానికి పెను ముప్పని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

అర్హత కలిగిన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి అక్రమ వైద్య విధానాలు కొనసాగితే నిరుపేద రోగుల ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని ఆవేదన చెందారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. జిల్లా వైద్యాధికారులు తక్షణమే స్పందించి మండలంలోని అన్ని మెడికల్‌‌ షాపులు, క్లినిక్‌లు, ఆర్‌ఎంపీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

తనిఖీల పేరుతో అధికారులు కేవలం ఫొటోలు దిగి వెళ్లిపోకుండా, నిబంధనలు ఉల్లంఘించి బెడ్లు వేసి సెలైన్లు ఎక్కిస్తున్న అక్రమార్కులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే, ప్రజలను సమీకరించి సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News