HomeTop StoriesPawan Kalyan: తెలంగాణ గాలిలో పౌరుషం ఉంది.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: తెలంగాణ గాలిలో పౌరుషం ఉంది.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: “తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది. నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది. నేలలో అమరుల రక్తం ఉంది” అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల పాటు సాగిన ఆత్మగౌరవ పోరాటానికి, అమరుల త్యాగాలకు ప్రతిఫలమే నేటి తెలంగాణ అని ఆయన కొనియాడారు.

- Advertisement -

అమరుల త్యాగాలకు వినమ్ర నివాళులు: “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని దాశరథి పలికిన అక్షర సత్యం.. స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం.. ఇదే రోజని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు, మరియు అమరవీరులకు ఆయన తన వినమ్ర నివాళులు అర్పించారు. సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు ఈ భూమి స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిందని ప్రశంసించారు.

“తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా.. అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.” అని పవన్ కల్యాణ్ అన్నారు.

అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలి: ప్రస్తుతం తెలంగాణ ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, స్టార్టప్ వ్యవస్థల్లో దేశంలోనే ప్రత్యేక ముద్ర వేసుకుంటోందని పవన్ అభినందించారు. అయితే అభివృద్ధి ఫలాలు సమాజంలో చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువతకు సమాన అవకాశాలు లభించే తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ఉండాలన్నారు.

జనసేన సంపూర్ణ నిబద్ధత: “తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత. అపూర్వమైన సంస్కృతి. అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పని చేస్తుందని అన్నారు. ఈ 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా సామాజిక న్యాయంతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News