Petrol shortage: హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా సామాన్యులు పరేషాన్ అవుతున్నారు. వరుసగా మూడో రోజు నగరంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న కొద్దిపాటి బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి.
గంటల తరబడి క్యూలైన్‌లో వాహనదారులు: ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో వాహనదారుల సహనం నశిస్తుంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంపాపేట్, ఐఎస్ సదన్ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా పెట్రోల్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read-10th Results: రేపు పదో తరగతి ఫలితాలు విడుదల!
స్తంభించిన ట్రాఫిక్: పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. బంకుల నుంచి రోడ్ల పైకి క్యూ లైన్లు రావడంతో తీవ్రస్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల అటు వాహనదారులు, ఇటు పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నారు. చమురు సంస్థల నుంచి సరఫరా నెమ్మదించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

