HomeTop StoriesPM Modi: మహిళల రిజర్వేషన్‌కు సహకరించండి.. ఎర్రకోట నుంచి మోడీ పిలుపు

PM Modi: మహిళల రిజర్వేషన్‌కు సహకరించండి.. ఎర్రకోట నుంచి మోడీ పిలుపు

న్యూఢిల్లీ(తెలుగుప్రభ): దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ 2047 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత్) నిర్మించేందుకు దేశ ప్రజలు కొత్త సంకల్పంతో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఎర్రకోట నుంచి వరుసగా 13వసారి జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశ ప్రగతికి భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, వాటిని సాధించేందుకు కలలు, సంకల్పం, సామర్థ్యంతో సమష్టిగా కృషి చేయాలని కోరారు. మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర సమరయోధులు, విప్లవ వీరులకు నివాళులర్పిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ‘వందే మాతరం’ సంపూర్ణంగా ఆలపించడం చారిత్రక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ గీతంతోపాటు దేశభక్తి భావన మరింత బలపడాలని ఆకాంక్షించారు. “ఈ రోజు ప్రతి హృదయం వందే మాతరం లయతో కొట్టుకుంటోంది. ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం.. ప్రతి మనసులోనూ త్రివర్ణ పతాకమే” అని మోడీ అన్నారు. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన కుటుంబాలకు ప్రధాని సంఘీభావం తెలిపారు. బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలు కోలుకునేలా అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పారు.

- Advertisement -

12 ఏళ్లలో దేశం సాధించిన పురోగతి అసాధారణం..

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన ప్రసంగంలో ప్రధాన లక్ష్యంగా మోడీ పేర్కొన్నారు. గతంలో భారత్‌ ఆర్థికంగా బలహీనమైన ‘ఫ్రాజైల్‌ ఫైవ్‌’ దేశాల జాబితాలో ఉండేదని గుర్తుచేసిన ఆయన.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదిగిందని అన్నారు. గత 12 ఏళ్లలో దేశం సాధించిన పురోగతి అసాధారణమని పేర్కొన్నారు. భారత్‌ ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడాలని, ఆత్మనిర్భరతే భవిష్యత్తుకు మార్గమని మోడీ స్పష్టం చేశారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, సెమీకండక్టర్‌ తయారీ, అణుశక్తి వంటి వ్యూహాత్మక రంగాల్లో దేశ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అణుశక్తి ఉత్పత్తిని 200 గిగావాట్లకు పెంచే లక్ష్యంతో భారత్‌ ముందుకు సాగుతోందని, ఐదు కొత్త అణు రియాక్టర్ల నిర్మాణం దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన ప్రక్రియలో ప్రజలు, ముఖ్యంగా యువత చురుకుగా పాల్గొనాలని ప్రధాని కోరారు. కుటుంబానికి సంబంధించిన వివరాలు డిజిటల్‌గా సరిగ్గా నమోదయ్యేలా యువత సహకరించాలని సూచించారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి..

మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడానికి అన్ని రాజకీయపార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమని పేర్కొన్న ఆయన.. ఈ నిర్ణయం అమలులో భాగస్వాములైన ప్రతి పార్టీ కూడా దాని ఘనతను పంచుకోవచ్చని అన్నారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని కేవలం ఒక చట్టపరమైన అంశంగా కాకుండా జాతీయ అవసరంగా చూడాలని ఆయన సూచించారు. అదే సమయంలో మహిళల ఆర్థిక సాధికారతపైనా ప్రధాని దృష్టి సారించారు. దేశంలో ‘లఖ్‌పతి దీదీ’ల సంఖ్యను ఆరు కోట్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలతో అనుబంధం ఉన్న మహిళల వార్షిక కుటుంబ ఆదాయం కనీసం రూ.లక్షకు చేరేలా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు.

‘సప్తధార’తో భారత్‌కు కొత్త దిశ..

ప్రపంచంలో మరింత బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ‘సప్తధార’గా పేర్కొన్న ఏడు శక్తి ప్రవాహాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత ఐదు నుంచి ఏడు దశాబ్దాల్లో సాధించలేకపోయిన లక్ష్యాలను రానున్న ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో సాధించేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. సప్తధార శక్తి, సామర్థ్యాలతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించేలా భారత్‌ను మరింత శక్తిమంతం చేస్తామని మోదీ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో యువత అపారమైన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. సప్తధారలో మొదటి శక్తి తయారీ రంగమని, రెండోది వ్యవసాయం, ఆహార ఉత్పత్తి అని వివరించారు. మూడో శక్తిగా సాంకేతికత, ఆవిష్కరణలను, నాలుగో శక్తిగా గతి శక్తిని, ఐదో శక్తిగా రక్షణ సామర్థ్యాలను పేర్కొన్నారు. ఆరో శక్తి హరిత, నీలి ఆర్థిక వ్యవస్థ కాగా, ఏడో శక్తి భారత్‌ సాఫ్ట్‌ పవర్‌ అని మోడీ వివరించారు.

ఏడాదిలో కోటి మంది యువతకు ఏఐ శిక్షణ..

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో భారత్‌ ప్రపంచానికి నాయకత్వం వహించేలా వచ్చే ఏడాదిలో కోటి మంది యువతకు ఏఐ నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మోడీ ప్రకటించారు. భవిష్యత్‌ ఉద్యోగాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. దేశం ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అవి ఖర్చు, నాణ్యత, నైపుణ్యం అని వివరించారు.

5-15 ఏళ్ల పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ..
ఐదు నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, పట్టణాలు, పాఠశాలల్లో టాలెంట్‌ హంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రధాని తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా వారిని దేశానికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రపంచ క్రీడా రంగంలో భారత్‌ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోందని పేర్కొన్న మోదీ.. 2030లో కామన్వెల్త్‌ క్రీడలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న విషయాన్ని గుర్తుచేశారు.

పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌..

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షల కోసం ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇది విప్లవాత్మక చర్యగా నిలుస్తుందని అన్నారు. ప్రముఖ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శిక్షణ అందించడం ద్వారా కోచింగ్‌ కేంద్రాల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని తెలిపారు.

40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు..

2014 నుంచి భారత్‌ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని మోడీ తెలిపారు. దీంతో భారతీయ వ్యాపారాలు, ఎగుమతిదారులకు ప్రపంచ మార్కెట్లలో అపారమైన అవకాశాలు లభించాయని చెప్పారు. ఈ అవకాశాలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. భారత్‌లో తయారయ్యే వస్త్రాలు, యంత్రాలు, ఔషధాలకు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అవకాశాలు ఉన్నాయని మోడీ అన్నారు. అయితే ప్రపంచ మార్కెట్లలో విజయవంతం కావాలంటే భారత ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడమే కాకుండా వాటిని అధిగమించే స్థాయికి చేరుకోవాలని సూచించారు.

‘ఇంటెలెక్చువల్‌ నక్సల్స్‌’పై అప్రమత్తంగా ఉండాలి..

అంతర్గత భద్రత అంశంలో నక్సలిజంపై మోడీ తీవ్రంగా స్పందించారు. దేశంలోని విస్తార ప్రాంతాలను ఒకప్పుడు నక్సలిజం ప్రభావితం చేసిందని, ఇప్పుడు మావోయిజం అంతిమ దశకు చేరుకుందని అన్నారు. అయితే సాయుధ నక్సలిజం బలహీనపడినప్పటికీ దాని భావజాలాన్ని ప్రచారం చేసే శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘దిమాగీ నక్సల్స్‌’ లేదా ‘ఇంటెలెక్చువల్‌ నక్సల్స్‌’ అనే పదాలను ఉపయోగించిన మోడీ.. తీవ్రవాద భావజాలాన్ని ఇతర రూపాల్లో కొనసాగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేశ భద్రతకు సంబంధించిన సవాళ్లు సరిహద్దుల బయట నుంచే కాకుండా దేశం లోపల కూడా వివిధ రూపాల్లో ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

దేశ భవిష్యత్తులో యువతదే కీలక పాత్ర..

భారత్‌ భవిష్యత్తును నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని ప్రధాని అన్నారు. ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగడం, ఉపాధి అవకాశాల సృష్టితోపాటు దేశ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాల్లో బాధ్యతాయుతంగా పాల్గొనాలని సూచించారు. తయారీ, సాంకేతికత, రక్షణ ఉత్పత్తులు, కొత్త ఇంధన రంగాల్లో భారత్‌ విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దేశంలో ఉన్న భారీ యువ జనాభాను ఆర్థిక బలంగా మార్చేందుకు ప్రభుత్వంతోపాటు పౌర సమాజం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ను సాధించాలంటే ప్రభుత్వ పథకాలు మాత్రమే సరిపోవని, ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. “మన కలలు, మన సంకల్పాలు పెద్దవిగా ఉండాలి” అని ఆయన పిలుపునిచ్చారు. పెద్ద లక్ష్యాలే దేశ సామర్థ్యాలను మరింత పెంచుతాయని అన్నారు. ఈ ఏడాది ప్రసంగంతో మోడీ ఎర్రకోట నుంచి వరుసగా 13వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా మరో మైలురాయిని చేరుకున్నారు. వరుసగా అత్యధిక స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేసిన ప్రధానుల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత మోడీ రెండో స్థానంలో నిలిచారు.

అంతర్జాతీయ రక్షణ తయారీ కేంద్రంగా భారత్‌..
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించి, భారత్‌ను అంతర్జాతీయ రక్షణ తయారీ కేంద్రంగా (గ్లోబల్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్) తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న ఈ తరుణంలో భారత్ కేవలం రక్షణ ఉత్పత్తుల మార్కెట్‌గా మిగిలిపోకూడదని ప్రధాని ఉద్ఘాటించారు. దేశీయంగా తర్వాతి తరం రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేస్తూ, ప్రపంచానికి ఆయుధ సరఫరాదారుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం డ్రోన్లు, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలు, అత్యాధునిక హైపర్‌సోనిక్ రక్షణ పరిజ్ఞానంలో భారత్ నాయకత్వ పాత్ర వహించాలని పిలుపునిచ్చారు.

‘సుదర్శన్ చక్ర’, మేడ్-ఇన్-ఇండియా విమానాలు..
దేశీయ గగనతల రక్షణ వ్యవస్థ ‘సుదర్శన్ చక్ర’ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ప్రధాని వెల్లడించారు. కీలకమైన సైనిక, పౌర స్థావరాల రక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా వడోదరలో ఎయిర్‌బస్, టాటా సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న ‘సీ-295’ మేడ్-ఇన్-ఇండియా రవాణా విమానం విజయవంతంగా గగనవిహారం చేసిందని ప్రస్తావించారు.
ఆధునిక యుద్ధ రీతులు – నూతన సివిల్ డిఫెన్స్ నెట్‌వర్క్ యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోయిందని, సైనిక సరిహద్దులకే పరిమితం కాకుండా డేటా సెంటర్లు, బ్యాంకింగ్ వ్యవస్థలు, రిఫైనరీలు వంటి కీలక మౌలిక వసతులపై సైబర్, ఆధునిక దాడులు జరిగే ప్రమాదం ఉందని మోడీ హెచ్చరించారు. గత శతాబ్దపు విధానాలతో పనిచేస్తున్న ప్రస్తుత పౌర రక్షణ వ్యవస్థల స్థానంలో, నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా విస్తృతమైన ఆధునిక వాలంటీర్ సివిల్ డిఫెన్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

గణనీయంగా పెరిగిన రక్షణ ఎగుమతులు..
గత 12 ఏళ్లలో దేశీయ రక్షణ రంగం సాధించిన ప్రగతిని ప్రధాని వివరించారు. 2014లో రూ. 46,000 కోట్లుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తి 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.78 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగి రూ. 38,424 కోట్లకు చేరాయని, భారత రక్షణ ఉత్పత్తులు ప్రస్తుతం దాదాపు 100 దేశాలకు సరఫరా అవుతున్నాయని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ద్వారా సైన్యంలో మహిళా శక్తి (‘నారీ శక్తి’) సారథ్యం మరింత బలోపేతమవుతోందని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News