Mann Ki Baat: దేశవ్యాప్తంగా భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్- 134వ ఎపిసోడ్‌లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఎండల తీవ్రత, రక్షణ చర్యలపై దేశప్రజలను అప్రమత్తం చేశారు.
సంప్రదాయ పానీయాల ప్రాధాన్యత: ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన వడగాల్పులు, ఎండలతో అతలాకుతలమవుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లాల్సి వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తాగునీటిని వెంట ఉంచుకోవాలని కోరారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగాలు జారీ చేసే హెచ్చరికలను పాటించాలన్నారు. అంతేకాకుండా ఎండల నుంచి ఉపశమనం కోసం మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వాడే సంప్రదాయ పానీయాల వైవిధ్యాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఉత్తర భారతంలో తాగే ఆమ్ పన్నా(పచ్చి మామిడి పానీయం), లస్సీ, మజ్జిగ, సత్తు షర్బత్ వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు.
కేరళ స్విమ్మింగ్ క్లబ్ సేవలకు ప్రశంస: వేసవి కాలంలో నీటి ప్రమాదాలు, మునిగిపోవడం వంటి ఘటనలు పెరిగే అవకాశం ఉన్నందున.. కేరళలోని ఆలువా ప్రాంతానికి చెందిన ఒక స్విమ్మింగ్ క్లబ్ చేస్తున్న సేవలను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. స్థానికులకు ఈత నేర్పించడంలో, ప్రాణాలు రక్షించడంలో వారు చూపుతున్న చొరవను ఆయన అభినందించారు.
Also read-CDS: నూతన సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి
చోళుల కాలం నాటి తామ్ర పత్రాల విశిష్టత: భారతీయ సంస్కృతి, చరిత్ర ఘనతను గుర్తుచేస్తూ.. చోళ రాజుల కాలం నాటి తామ్ర పత్రాల (రాగి శాసనాల) గురించి ప్రధాని మాట్లాడారు. నాటి పరిపాలన, దానధర్మాలు, సమాజ నిర్మాణానికి సంబంధించిన ఎన్నో చారిత్రక ఆధారాలు ఈ తామ్ర పత్రాల ద్వారా నేటికీ సజీవంగా ఉన్నాయని అన్నారు. మన పూర్వీకుల మేధస్సుకు ఇవి నిదర్శనాలని మోదీ కొనియాడారు.

