Hyderabad: ప్రధాని మోదీ నేడు హైదరాబాద్‌లో పర్యటిస్తుండడంతో భాగ్యనగరం కాషాయమయమైంది. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. సుమారు రూ. 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు.. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్‌ఐసీసీ(HICC)కి వెళ్తారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం గచ్చిబౌలిలోని సాయిసింధు ఆసుపత్రిని మోదీ ప్రారంభించనున్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతో మోదీ భేటీ: ఈ పర్యటనలో రాజకీయంగా అత్యంత ఆసక్తికరమైన అంశం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలకు ప్రధాని వెళ్లడం. పవన్ కల్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయనను మోదీ పరామర్శించనున్నారు. ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి సైతం పాల్గొననున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడితో ప్రధాని మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.
పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ:సాయంత్రం 6:15 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సభ కోసం బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున జన సమీకరణ చేశాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాల నేపథ్యంలో తెలంగాణపై దృష్టి సారించేలా పార్టీ శ్రేణులకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణే అని పార్టీ వర్గాలు భావిస్తున్న తరుణంలో మోదీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వేడిని రగిలించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు: మోదీ వస్తుండడంతో ఎస్పీజీ (SPG) బృందాలు ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. ప్రధానికి స్వాగతం పలికేందుకు వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి 100 మంది బీజేపీ కార్పొరేటర్లతో ప్రత్యేక లైనప్‌ను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో సాధువుల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయగా.. సాయిసింధు ఆసుపత్రి వద్ద పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మోదీకి స్వాగతం పలకనున్నారు.

