Telangana Police: బక్రీద్ పండుగ సమీపిస్తున్న వేళ శాంతిభద్రతల పరిరక్షణకై తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలను ముమ్మరం చేశారు. ఇటీవల మెహిదీపట్నం పరిధిలోని గుడిమల్కాపూర్ వద్ద పశువుల రవాణా విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం.. లారీపై రాళ్లదాడి జరగడం తెలిసిందే. సమాచారం అందుకున్న నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సైన్ తన అనుచరులతో అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే పోలీసులు సకాలంలో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 203 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది.
శాంతిభద్రతల పరిరక్షణకై గట్టి నిఘా: పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నగరవ్యాప్తంగా.. కమిషనరేట్ సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రతరం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ అధికారులు ఇప్పటికే గోరక్షక్ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అక్రమ పశు రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలే తప్ప.. వాహనాలను వెంబడించడం, దాడులు చేయడం వంటి పనులు చేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also read-Owaisi: పరీక్షలు వాయిదా వేయండి.. సీఎంను కోరిన అసదుద్దీన్ ఓవైసీ
ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే చట్టపరంగా చర్యలు: పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 203 చెక్ పోస్టుల ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 52 చెక్ పోస్టుల ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. పండుగ ముగిసే వరకు చెక్‌పోస్టుల వద్ద నిరంతరాయంగా తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. పండుగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ శాఖ కోరింది.

