Norway chess title: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నమెంట్‌లో క్లాసికల్ విభాగంలో టైటిల్ కైవసం చేసుకుని రికార్డులకెక్కాడు. ఉత్కంఠభరితంగా సాగిన చివరి రౌండ్‌లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించాడు. ఈ గెలుపుతో నార్వే చెస్ టోర్నీ టైటిల్‌ను ముద్దాడిన మొట్టమొదటి భారతీయుడిగా 20 ఏళ్ల ప్రజ్ఞానంద సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
ఉత్కంఠ పోరులో అద్భుత విజయం: టోర్నమెంట్ ఆరంభం నుండి అత్యంత నిలకడగా రాణిస్తూ వచ్చిన ప్రజ్ఞానంద.. ఆఖరి రౌండ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. జర్మనీకి చెందిన బలమైన ప్రత్యర్థి విన్సెంట్ కీమర్‌ను తన వ్యూహాత్మక చతురతతో చిత్తు చేశాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లు తలపడే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఒక భారతీయ ఆటగాడు ఛాంపియన్‌గా నిలవడం దేశీ చెస్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
చరిత్రలో తొలిసారి: దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్‌కు సైతం సాధ్యం కాని ఈ ఘనతను.. నార్వే చెస్ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద సాధించడం విశేషం. ప్రజ్ఞానంద సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ యువ గ్రాండ్‌మాస్టర్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

