- ఎర్రవల్లిలో ‘పోలీస్ కవచం’.. ప్రశాంతంగా ముగిసిన హైటెన్షన్!
- వెయ్యి మందికిపైగా బలగాలతో కట్టుదిట్టమైన భద్రత
- ఇరు వర్గాలను ఫామ్‌హౌస్‌కు చేరకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
- పరిస్థితి చేయిదాటకుండా సంయమనంతో వ్యవహరించిన ఉన్నతాధికారులు
- సీపీ రష్మీ పెరుమాళ్ నేతృత్వంపై వెల్లువెత్తిన ప్రశంసలు
- ‘‘భళా పోలీస్.. శెభాష్ పోలీస్’’ అంటూ ప్రజల అభినందనలు
సిద్దిపేట(తెలుగుప్రభ): ఒకవైపు రాజకీయ ప్రకటనలు.. మరోవైపు పోటాపోటీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు.. ఇంకోవైపు ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ.. ఇలాంటి పరిస్థితుల్లోనూ సిద్ధిపేట జిల్లాలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాసం ఉండే ఎర్రవల్లిలో ప్రశాంతతను కాపాడటంలో పోలీస్ యంత్రాంగం వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఉద్రిక్తతలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందస్తు వ్యూహంతో వ్యవహరించిన పోలీసులు.. వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఒకే ప్రాంతంలోకి చేరకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోనే కొనసాగింది. ముఖ్యంగా సిద్ధిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ నేతృత్వంలో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన బలగాలు చూపిన సంయమనం, సమన్వయం చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ పిలుపులతో పెరిగిన ఉద్రిక్తత..
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ.. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిని కూడా బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ వద్ద వేలాది డప్పులతో ‘చావు డప్పు’ కొడతామని ప్రకటించి.. ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు ఎమ్మెల్సీల వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఫామ్‌హౌస్ ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచే మార్కుక్ మండలంలోని ఎర్రవల్లి పరిసరాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎర్రవల్లి వైపు కదలడంతో పాటు.. బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా భారీగా అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎర్రవల్లి చుట్టూ పోలీస్ కంచె..
పరిస్థితి సున్నితంగా మారుతుందన్న అంచనాతో పోలీస్ యంత్రాంగం ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సిద్ధిపేట జిల్లా సీపీ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో, ఐజీ, డీఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, సన్‌ప్రీత్‌సింగ్, జోయల్ డేవిస్ పర్యవేక్షణలో సుమారు వెయ్యి మందికిపైగా పోలీస్ బలగాలను రంగంలోకి దించారు. ఫామ్‌హౌస్ చుట్టూ భారీగా బలగాలను మోహరించడంతో పాటు.. పరిసర ప్రాంతాల్లో కంచె ఏర్పాటు చేశారు. ఫామ్‌హౌస్‌కు వెళ్లే ప్రధాన మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సమీప ప్రాంతాల్లో సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలను నిలిపివేసి, అవసరం లేని వ్యక్తులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు. దీంతో ఎర్రవల్లి పరిసర ప్రాంతాలు ఉదయం నుంచే పోలీస్ కోటను తలపించాయి.
నలువైపుల నుంచి తరలివచ్చిన శ్రేణులు..
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎర్రవల్లి వైపు నలుమూలల నుంచి తరలివచ్చారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించాయి. కాంగ్రెస్ ముట్టడిని అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తూ నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత సున్నితంగా మారింది. ఒకే ప్రాంతంలో ఇరు పార్టీల శ్రేణులు ముఖాముఖిగా తలపడితే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఎవరినీ రెచ్చగొట్టకుండా.. బలప్రయోగానికి తావులేకుండా.. ఇరు వర్గాలను ఫామ్‌హౌస్ వైపు కదలనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
నేతల అరెస్టులు.. స్టేషన్లకు తరలింపు..
పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పలువురు బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలించారు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లి వైపు రావడానికి ప్రయత్నించగా.. వారిని పోలీసులు హకీంపేట, బొల్లారం ప్రాంతాల్లో అడ్డుకుని జవహర్‌నగర్, బోయినపల్లి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు.
చిన్నచిన్న ఘటనలు మినహా.. ప్రశాంతంగానే..
పోలీసుల ముందస్తు ప్రణాళిక, భారీ బలగాల మోహరింపు, నిరంతర నిఘాతో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు అవకాశం లేకుండా పోయింది. వరదరాజ్‌పూర్, దామరకుంట ప్రాంతాల్లో ఒకరిద్దరు నాయకుల దిష్టిబొమ్మల దహనం, ఓ కారుపై రాళ్లు రువ్వడం వంటి చిన్నచిన్న ఘటనలు మినహా పెద్దగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఇరు వర్గాలకు చెందిన వారు ఫామ్‌హౌస్ సమీపానికి చేరుకోకుండా పోలీసులు కట్టడి చేయడంతో పరిస్థితి అదుపులోనే కొనసాగింది. ఎక్కడికక్కడ అడ్డుకున్న వారిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించడం, మరికొందరిని అక్కడి నుంచి పంపించేయడంతో మధ్యాహ్నం తర్వాత పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది.
ఉద్రిక్తత నడుమ ‘సంయమనం’ ఆయుధంగా..
వేలాది మంది కార్యకర్తలు ఒకే ప్రాంతంలోకి పోటాపోటీగా చేరుతున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి ఘర్షణ కూడా పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. కానీ, ఎర్రవల్లిలో పోలీసులు మాత్రం సంయమనాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాల కదలికలను నియంత్రించారు. రెచ్చగొట్టే పరిస్థితులు ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షించారు. ఎక్కడైనా పరిస్థితి ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపించిన వెంటనే అక్కడికి అదనపు బలగాలను తరలించారు. దీంతో ఉదయం నుంచి నెలకొన్న హైటెన్షన్ వాతావరణం సాయంత్రానికి క్రమంగా చల్లబడింది.
ప్రజల భద్రతకే పెద్దపీట..
రాజకీయంగా ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా.. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటం పోలీసుల ముందున్న ప్రధాన సవాలుగా మారింది. భారీగా బలగాలను మోహరించినప్పటికీ ప్రజలతో దురుసుగా వ్యవహరించకుండా, పరిస్థితిని అర్థం చేసుకుని అవసరమైన చోట మాత్రమే ఆంక్షలు విధించడం పోలీసుల పనితీరులో ప్రత్యేకతగా నిలిచింది. ముఖ్యంగా ఫామ్‌హౌస్ పరిసరాల్లోకి ఇరు వర్గాలు చేరకుండా తీసుకున్న నిర్ణయం వల్ల పెద్ద ఘర్షణ తప్పిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇరు పార్టీల శ్రేణులు ముఖాముఖిగా తలపడితే పరిస్థితి ప్రమాదం వేరేగా ఉండేదని.. పోలీసులు ముందుగానే ఆ ప్రమాదాన్ని పసిగట్టి అడ్డుకున్నారని పేర్కొంటున్నారు.
సీపీ రష్మీ నేతృత్వానికి ప్రశంసలు..
సిద్దిపేట జిల్లా సీపీ రష్మీ పెరుమాళ్ నేతృత్వంలో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ బలగాలు సమన్వయంతో పనిచేయడం వల్లే ఎర్రవల్లిలో పరిస్థితి అదుపులో కొనసాగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర స్థాయి రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశం కావడంతో చిన్నపాటి ఘటన కూడా పెద్ద రూపం దాల్చే అవకాశం ఉన్నప్పటికీ.. పోలీసులు ఎక్కడా తొందరపడకుండా, సంయమనంతో వ్యవహరించడం వల్ల పరిస్థితి చేయిదాటలేదు. పోలీస్ ఉన్నతాధికారుల సమన్వయం, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తత, ముందస్తు ప్రణాళిక కలగలిపి ఎర్రవల్లిలో శాంతిభద్రతలను కాపాడగలిగారని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
సాయంత్రానికి ఇళ్లకు చేరిన శ్రేణులు..
పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని పలువురు నాయకులు, కార్యకర్తలను చుట్టుముట్టు పరిసర ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరికొందరిని అక్కడి నుంచి పంపించివేయడంతో మధ్యాహ్నం తర్వాత ఎర్రవల్లి పరిసరాల్లో జనసంచారం తగ్గింది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి చాలామంది తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఎర్రవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ కట్టుదిట్టమైన పోలీస్ భద్రత కొనసాగుతోంది. పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
‘భళా పోలీస్.. శెభాష్ పోలీస్’..
ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠతో రోజంతా గడిపిన ఎర్రవల్లి, పరిసర గ్రామాల ప్రజలకు చివరకు ప్రశాంత వాతావరణం నెలకొనడం ఊరట కలిగించింది. రాజకీయ వేడి ఎంత ఉన్నా.. ప్రజల మధ్య ఘర్షణలు జరగకుండా అడ్డుకోవడంలో పోలీసులు చూపిన సంయమనం స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ‘‘వేలాది మంది ఒకేచోట చేరినా.. పరిస్థితిని చేయిదాటనివ్వకుండా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. ముందస్తు చర్యలతో పెద్ద ప్రమాదాన్ని నివారించారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సీపీ రష్మీ పెరుమాళ్ నేతృత్వంలో పోలీస్ యంత్రాంగం వ్యవహరించిన తీరు అభినందనీయం’’ అంటూ పలువురు స్థానికులు పేర్కొంటున్నారు. మొత్తంగా.. రాజకీయ వేడి మధ్య ఎర్రవల్లి ప్రశాంతంగా ఉండటంలో పోలీసుల సంయమనం కీలకంగా నిలిచింది. ఉద్రిక్తతలకు తావివ్వకుండా ఇరు వర్గాలను అదుపులో ఉంచి, ప్రజల భద్రతకు పెద్దపీట వేసిన పోలీస్ యంత్రాంగంపై ‘భళా పోలీస్.. శెభాష్ పోలీస్’ అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

