Prashant Kishor Bankipur Bypoll Victory : మూడు దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంగా నిలిచిన ఒక రాజకీయ దుర్గంలో ఉన్నట్టుండి సంచలన తుపాను చెలరేగితే ఎలా ఉంటుంది? గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న ప్రత్యర్థులకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లుగా ఫలితం మారితే ఆ రాజకీయ సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయి? బిహార్ రాజకీయాల్లో సరిగ్గా అలాంటి అరుదైన ఘట్టమే ఆవిష్కృతమైంది. పాట్నా నడిబొడ్డున ఉన్న బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం కమలదళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
కమలకోట ఖాళీ కావడం – బైపోల్ అనివార్యం : బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన బీజేపీ సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు నితీన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. బీజేపీ తరఫున యువ నాయకుడు నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దించగా, ఆర్జేడీ తరఫున రేఖా గుప్తా పోటీపడ్డారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ‘పీకే’ ఎంట్రీ : గత ఏడాది నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఖాతా తెరవలేకపోయినప్పటికీ, ఈ ఉపఎన్నికను ప్రశాంత్ కిశోర్ ఒక సవాలుగా తీసుకున్నారు. ‘వ్యవస్థ మార్పు’ అనే ప్రధాన నినాదంతో తానే నేరుగా అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం చేపట్టారు.
ఓట్ల లెక్కింపులో పీకే హవా : రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయిన ప్రశాంత్ కిశోర్, సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో జన్ సురాజ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొనగా, శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నాయి.
పాలకులపై అసంతృప్తి – మార్పు వైపు ప్రజల చూపు: బాంకీపూర్ విద్యావంతులు, ఉన్నత వర్గాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. నిరుద్యోగం, యువత వలసలు, విద్యావ్యవస్థలో లోపాలు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలపై పీకే పదునైన విమర్శలు చేశారు. ఇది స్థానిక ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది.
కులాతీత ఓటింగ్ – సమీకరణాల మార్పు: సాంప్రదాయకంగా బీజేపీ వైపు ఉండే ఓటు బ్యాంకుతో పాటు, ఉపాధి-అభివృద్ధి ప్రతిపాదికన యువత, విద్యావంతుల ఓట్లు పెద్ద ఎత్తున జన్ సురాజ్ వైపు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది. పాదయాత్రల ద్వారా ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే ప్రతి ఇంటికీ చేరుకోవడం, స్థానిక సమస్యలపై పక్కా నివేదికలతో ప్రజాక్షేత్రంలో నిలబడటం ఆయన గెలుపుకు బలమైన పునాదిగా మారింది.
“బాంకీపూర్ ప్రజలు బిహార్ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మా పోరాటం ఏ ఒక్క వ్యక్తిపైనో కాకుండా, దశాబ్దాలుగా ఉన్న చెడు వ్యవస్థపై మాత్రమే. విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, బిహార్ బిడ్డలు పొట్టకూటి కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చూడటమే మా ప్రధాన లక్ష్యం”
– ప్రశాంత్ కిశోర్

