న్యూఢిల్లీ (తెలుగుప్రభ): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దేశ రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన కోసం ప్రధాని ప్రతిపాదించిన సమగ్ర అభివృద్ధి ప్రణాళికను బీజేపీ అగ్రనేతలు, పారిశ్రామిక ప్రముఖులు “అద్భుతం, మైలురాయి”గా కొనియాడగా, కేవలం ఎన్నికల హామీల వర్షం తప్ప గత వాగ్దానాల అమలులో పురోగతి లేదని సీపీఎం, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.
బీజేపీ అగ్రనేతల హర్షం..
ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకత్వం ముక్తకంఠంతో సమర్థించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా: ‘నేషన్ ఫస్ట్’ స్ఫూర్తితో రూపొందించిన ‘సప్తధార’ విధానం దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతుందని, స్వదేశీ, స్వయం సమృద్ధి లక్ష్యాల దిశగా ఇదొక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. కోటి మందికి ఏఐ శిక్షణ, 100 గిగావాట్ల అణు విద్యుత్, కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు యువత సామర్థ్యానికి పెద్దపీట వేస్తాయని తెలిపారు. ఎర్రకోటపై తొలిసారిగా వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించడం చరిత్రాత్మకమని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రసంగం “సూపర్‌బ్ అండ్ ఔట్‌స్టాండింగ్” గా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. రక్షణ రంగంలో స్వావలంబన, తయారీ, అధునాతన సాంకేతికతల ద్వారా భారత్‌ను గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చే నిబద్ధత ఇందులో స్పష్టంగా కనిపించిందన్నారు. ‘సప్తధార’ ద్వారా దేశ యువతలో నూతనోత్తేజం నిండిందని, ఎంఎస్ఎంఈలు, ఎగుమతిదారులు ఎఫ్‌టీఏ (FTA)లను వినియోగించుకుని ప్రపంచ మార్కెట్లను చేజిక్కించుకోవడానికి వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. 140 కోట్ల పౌరుల సంకల్పంతో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాకారం కావడం ఇక కల మాత్రమే కాదని, ఒక జాతీయ లక్ష్యంగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేర్కొన్నారు.
పరిశ్రమ వర్గాల స్వాగతం: పెట్టుబడులకు సిద్ధం..
ప్రధాని మోడీ ప్రకటించిన ప్రణాళికలను భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), అసోచామ్ వంటి ప్రముఖ పారిశ్రామిక సంఘాలు స్వాగతించాయి. పదేళ్లలో భారత్ ‘ఫ్రాజైల్ ఫైవ్’ స్థాయి నుంచి ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందనిసీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కొనియాడారు. సెమీకండక్టర్లు, గ్రీన్–బ్లూ ఎకానమీ, అణు విద్యుత్, వ్యవసాయ ఆహార శుద్ధి రంగాల్లో ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను విస్తరించేందుకు పరిశ్రమ వర్గాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ‘వోకల్ ఫర్ లోకల్’, దేశీయ తయారీ, వ్యూహాత్మక సాంకేతికతలపై దృష్టి సారించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అసోచామ్ అధ్యక్షుడు నిర్మల్ కుమార్ మిందా విశ్వాసం వ్యక్తం చేశారు.
హామీల వర్షమే తప్ప ఫలితం శూన్యం: విపక్షాలు
మరోవైపు, ప్రధాని ప్రసంగంపై వామపక్షాలు, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ విమర్శలు: ప్రధాని నరేంద్ర మోడీ హామీలు కురిపించడంలో “అసాధారణ దృగ్విషయం” అని ఎద్దేవా చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న గత హామీ ఏమైందో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టి గెరిమాండరింగ్ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోందని ఆరోపించారు. వందేమాతరం పూర్తి వెర్షన్ పేరుతో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ వేదికపై రాజకీయాలు మాట్లాడటం తగదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జైరామ్ రమేష్ విమర్శించారు. అసమ్మతిని అణచివేసేందుకు ‘దిమాగీ నక్సల్స్’ వంటి ముద్రలు వేస్తున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును వెంటనే ప్రస్తుత సీట్లలోనే అమలు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, టీఎంసీ డిమాండ్ చేశాయి.

