BJP Vs BRS: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నేతన్న చౌరస్తా వద్ద బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీ ధర్నాలకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర నినాదాలతో ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా చేజారిపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
రణరంగంగా మారిన నేతన్న చౌరస్తా: బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో నేతన్న చౌరస్తాకు చేరుకుని ధర్నాకు దిగడంతో వివాదం మొదలైంది. ఒకరినొకరు కౌంటర్ ఇస్తూ.. “బండి సంజయ్ డౌన్ డౌన్”.. “కేటీఆర్ డౌన్ డౌన్” అంటూ భారీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి.. పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి వెళ్లింది.
పోలీసుల లాఠీచార్జ్: ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో ఉభయ పార్టీల నేతలను నియంత్రించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఇరు పార్టీల ముఖ్య నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇరు పార్టీల పోటాపోటీ ఆందోళనల కారణంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Also read-Telangana: పోలీసుల హై అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా 203 చెక్ పోస్టులు!
పోలీసుల భారీ మోహరింపు: ఘర్షణ నేపథ్యంలో నేతన్న చౌరస్తా వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు మళ్లీ చౌరస్తా వైపు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిరిసిల్లలో పరిస్థితి పోలీసుల అదుపులోనే ఉన్నప్పటికీ.. ఇంకా ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది.

