Punjab Kings coaching staff resignation : గత సీజన్ల చేదు జ్ఞాపకాలను చెరిపివేసి, రాబోయే ఐపీఎల్ 2027 సమరానికి సరికొత్త వ్యూహాలతో సమాయత్తమవుతున్న పంజాబ్ కింగ్స్‌కు ఊహించని పిడుగుపాటు తగిలింది. ప్రణాళికలు రచిస్తున్న వేళ, జట్టు వెన్నెముకగా నిలిచిన ఇద్దరు కీలక ఆస్ట్రేలియా కోచ్‌లు ఒకేసారి గుడ్‌బై చెప్పారు. అసలు విజయాల బాట పడుతున్న వేళ ఈ ఆస్ట్రేలియన్ ద్వయం ఎందుకు వైదొలిగింది? కోచింగ్ విభాగంలో ఏర్పడిన ఈ పెను ఖాళీలను రికీ పాంటింగ్ ఎలా భర్తీ చేయనున్నారు.
ఆస్ట్రేలియా పిలుపుతోనే నిష్క్రమణ: పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్, ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ తమ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు ఈ నిర్ణయాన్ని పంజాబ్ యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరిస్తూ వారికి వీడ్కోలు పలికింది. అయితే వీరిద్దరూ వ్యక్తిగత విభేదాలతో కాకుండా, స్వదేశీ లీగ్‌లలో ప్రతిష్ఠాత్మక బాధ్యతలు దక్కించుకోవడం వల్లే ఐపీఎల్‌ను వీడాల్సి వచ్చింది. హోప్స్ క్వీన్స్‌లాండ్‌తో పాటు బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్‌కు హెడ్ కోచ్‌గా నియమితులు కాగా, బ్రాడ్ హాడిన్ న్యూసౌత్ వేల్స్ మెన్స్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
పాంటింగ్ ముంగిట త్రిముఖ సవాలు: హోప్స్, హాడిన్‌ల నిష్క్రమణతో పాటు ఇదివరకే స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే కూడా భారత జాతీయ జట్టు సహాయక సిబ్బందిలోకి వెళ్లిపోయారు. దీంతో తదుపరి సీజన్ ప్రారంభానికి ముందే పాంటింగ్ సహాయక బృందంలో ఏకంగా మూడు కీలక స్థానాలు ఖాళీ అయ్యాయి. 2025 సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జట్టు రన్నరప్‌గా నిలవడంలో ఈ ద్వయం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు వీరి స్థానాలను సరైన నిపుణులతో భర్తీ చేయడం పంజాబ్‌కు పెను పరీక్షగా మారింది.

