Rahul Gandhi Sanatan Dharma FIR Varanasi : పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలు చేపట్టిన వినూత్న నిరసన ప్రదర్శన ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ అగ్గి రాజేస్తోంది. చట్టసభల ఆవరణలో చోటుచేసుకున్న ఒక నాటకీయ ఘట్టం.. కాశీ క్షేత్రంలో తీవ్రస్థాయి కేసుల దాకా దారితీసింది. లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో పాటు బీహార్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ (రాజేశ్ రంజన్), సమాజ్‌వాదీ పార్టీ ఫైజాబాద్ (అయోధ్య) ఎంపీ అవధేశ్ ప్రసాద్‌లపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి పోలీసులు కేసు నమోదు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పార్లమెంటు ముంగిట వేసిన ఒక ‘స్కిట్’ సనాతన ధర్మాన్ని, హిందూ సాధువుల సనాతన సాంప్రదాయాలను కించపరిచేలా ఉందంటూ ఆధ్యాత్మిక నగరి వారణాసిలోని సాధువులు, న్యాయవాదులు తిరగబడ్డారు.
వివాదానికి మూలం – పార్లమెంట్ వద్ద ‘చందా చోరీ’ నాటకం : అయోధ్య శ్రీరామ జన్మభూమి క్షేత్రంలో భక్తులు సమర్పించిన విరాళాల (చడావా) వ్యవహారంలో గోల్‌మాల్ జరిగిందంటూ విపక్షాల కూటమి పార్లమెంట్ మకర ద్వారం వద్ద వినూత్న నిరసనకు దిగింది. ఈ ప్రదర్శనలో స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ భగవా వస్త్రాలు (కాషాయ దుస్తులు) ధరించి సాధువు వేషధారణలో కనిపిస్తూ.. చేతిలో ఒక దానపాత్ర పట్టుకుని నాటకీయ రీతిలో ప్రవర్తించారు.
ఆ దానపాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్‌లు సంకేతాత్మకంగా నాణేలు, డబ్బులు వేస్తుండగా.. సాధువు వేషంలో ఉన్న పప్పూ యాదవ్ ఆ డబ్బులను తన జేబులో వేసుకుంటున్నట్లు లేదా దొంగిలిస్తున్నట్లు ఒక నాటికను ప్రదర్శించారు. విపక్షాల దృష్టిలో ఇది రాజకీయ నిరసన అయినప్పటికీ.. సనాతన సంప్రదాయాలను అనుసరించే వారి దృష్టిలో ఇది తీవ్ర మనోభావాలను దెబ్బతీసే చర్యగా మారింది.
మండిపడిన కాశీ సాధు సమాజం – కొత్వాలి ఠాణాలో ఫిర్యాదు : ఈ ప్రదర్శన దృశ్యాలు సామాజిక మాధ్యమాలు, వార్తా ఛానళ్లలో వ్యాపించడంతో ఆధ్యాత్మిక రాజధాని వారణాసి (కాశీ)లోని సాధు సమాజం ఉడికిపి పోయింది. పాాతాళపురి మఠానికి చెందిన మహంత్ జగద్గురు బాలక్ దాస్ జీ మహారాజ్ నాయకత్వంలో ఆరు గంటలకు పైగా సంప్రదింపులు జరిపిన సాధువులు, పలువురు న్యాయవాదులు డిసిపి కాశీ జోన్ గౌరవ్ బన్స్వాల్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. కాశీ కొత్వాలి పోలీసు స్టేషన్‌లో సమర్పించిన ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాహుల్ గాంధీ, పప్పూ యాదవ్, అవధేశ్ ప్రసాద్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కాశీ జోన్ డిసిపి గౌరవ్ బన్స్వాల్ అధికారికంగా ధ్రువీకరించారు.
సాధువుల ఆగ్రహం – ఫిర్యాదులోని ప్రధాన అంశాలు
కాషాయ వస్త్రాల అవమానం: పరమ పవిత్రమైన కాషాయ రంగును, సాధువుల వేషధారణను చౌకబారు రాజకీయ ప్రచారానికి నాటకీయంగా వాడుకోవడం పవిత్ర సన్యాసి పరంపరను అవమానించడమే.
శ్రీరాముడు, దానపాత్రపై వ్యాఖ్యలు: కోట్లమంది భక్తులు నిష్ఠతో శ్రీరామ మందిరంలో అర్పించే పవిత్ర విరాళాలను, హిందూ దైవ చిహ్నాలను హాస్యస్పదం చేయడం హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది.
సామాజిక ఉద్రిక్తతల ప్రమాదం: బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యులు ఇటువంటి ప్రదర్శనల ద్వారా సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు పెంచేలా ప్రవర్తించారని సాధువులు ఆరోపించారు. “రాజకీయ నిరసనలకు హద్దులు ఉండాలి. సనాతన ధర్మాన్ని, సాధువులను దొంగలుగా చిత్రీకరించే హక్కు ఏ నాయకుడికీ లేదు” అని మహంత్ బాలక్ దాస్ పేర్కొన్నారు.

