Rain Alert To Software companies: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గురువారం రాత్రి నుంచి హైదరాబాద్ నగర పరిధిలోని అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్ దిల్‌సుఖ్‌నగర్, ఖైరతాబాద్, నాంపల్లిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. రాత్రి నుంచి నాన్‌స్టాప్‌గా వర్షం పడుతుండటంతో దీంతో ప్రధాన రహదారులు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే నగర పరిధిలోని పలు ఐటీ కంపెనీలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉద్యోగులందరికీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇవ్వాలని ఐటీ కంపెనీలను కోరారు. అదేవిధంగా నగర ప్రజలు ఎవరైనా అత్యవసరం అయితేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/extremely-heavy-rains-in-telangana/

ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వండి..
ఇప్పటికే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు.. ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోం అంశాన్ని పరిశీలించాలని కోరారు. అదే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు.. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు మెట్రో వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం చేయవాలని సూచించారు. మరోవైపు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కరెంట్ పోల్స్, మ్యాన్‌హోల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తుతోంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.34 మీటర్లతో ఫుల్‌ట్యాంక్ లెవల్‌కు చేరుకుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.


