Junior Telecom Officer: ఇంజినీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) తీపి కబురు అందించింది. జూనియర్ టెలికాం ఆఫీసర్ కేడర్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1 పోస్టు, తెలంగాణ సర్కిల్‌లో 2 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ (B.E), బీటెక్, ఎంటెక్ (M.Tech) లేదా ఎంఎస్సీ (M.Sc) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 జులై 3 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16,400 నుంచి రూ.40,500 స్కేల్ ప్రకారం వేతనం అందుతుంది.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 2026 జూన్ 4
- దరఖాస్తుకు చివరి తేదీ: 2026 జులై 3
- దరఖాస్తుల సవరణ గడువు: జులై 4 నుంచి 11 వరకు
- రాత పరీక్ష: 2026 ఆగస్టు నెలలో నిర్వహించనున్నారు.
దరఖాస్తు ఫీజు వివరాలు:
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు: రూ.2,000
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు: రూ.1,000
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

