Rajahmundry: రహదారి నిబంధనల పట్ల చూపే చిన్నపాటి నిర్లక్ష్యం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాజమండ్రిలోని రోడ్ కం రైల్వే వంతెనపై సోమవారం రాత్రి జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరించకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిందిలా: పోలీసులు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కొవ్వూరుకు చెందిన పోతుగుంట అక్షయ్ కుమార్(20), తగరపు సత్యకల్యాణ్(20), కొమిరి ఏడుకొండలు ఒకే ద్విచక్రవాహనంపై రాజమండ్రి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో రాజమండ్రి క్వారీ మార్కెట్‌కు చెందిన ఆనాపు లక్ష్మీనారాయణ(28) తన స్కూటీపై కొవ్వూరు వైపు వస్తున్నారు. వంతెనపై మరో వాహనాన్ని ఓవర్‌టేక్ (అధిగమించే) చేసే క్రమంలో రెండు వాహనాలు వేగంగా ఢీకొన్నాయి. ఈ ధాటికి అక్షయ్, సత్యకల్యాణ్, లక్ష్మీనారాయణలు కిందపడిపోయారు. దీంతో వారి తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రాణం నిలిపిన హెల్మెట్: ఈ ప్రమాదంలో విధి చిత్రమేమిటంటే.. ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్‌పై ఉన్న కొమిరి ఏడుకొండలు హెల్మెట్ ధరించి ఉండటంతో కేవలం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన కొవ్వూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో అక్షయ్, సత్యకల్యాణ్ చిన్నప్పటి స్నేహితులు కావడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also read-Accident: కన్నవారి ఆశలను చిదిమేసిన వేగం.. కాబోయే వైద్యురాలు మృతి
భారీగా ట్రాఫిక్ జామ్: ప్రమాద తీవ్రత కారణంగా రోడ్డు రైలు వంతెనపై సుమారు గంటన్నర పాటు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న కొవ్వూరు, రాజమహేంద్రవరం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

