Rohini Karte: “రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి” అన్న సామెతను నిజం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. వేసవి కాలంలో ఉక్కబోతకు కేరాఫ్ అడ్రస్ అయిన రోహిణి కార్తె నేటి(మే 25) నుంచి ప్రారంభమైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. సూర్యుడు సోమవారం రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించనున్నాడు. ఈ పక్షం రోజుల పాటు భానుడు భగభగలాడుతూ తీవ్రమైన వేడి గాలులను విరజిమ్ముతాడని వాతావరణశాఖతో పాటు జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది. దీంతో ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు తాళలేక తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రానున్న వారంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Also read-Heat waves: భానుడి భగభగలు.. ఒక్కరోజే 10 లక్షల కోళ్లు మృతి!
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: ఏపీలో భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆదివారం ఏపీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 49 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదయ్యింది. నేటి నుండి రోహిణి కార్తె ప్రారంభం కానుండడంతో.. ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో సైతం ఎండలు విపరీతంగా పెరిగాయి. రాబోయే రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరుతున్నారు.

