Davos summit 2026: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం పెట్టుబడుల వేటలో రికార్డు సృష్టించింది. సదస్సు రెండో రోజైన బుధవారం వివిధ అంతర్జాతీయ సంస్థలతో సుమారు రూ. 23,000 కోట్ల విలువైన ఎంఓయూలను (MoUs) కుదుర్చుకుంది. స్టీల్, గ్రీన్ ఎనర్జీ, బ్యూటీ-టెక్, ఏవియేషన్ రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి.
రూ.12,500 కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ కర్మాగారం: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రష్మి గ్రూప్ రాష్ట్రంలో భారీ స్టీల్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రూ. 12,500 కోట్లతో స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. దీంతో 12,000 మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తయారీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు సరఫరా లింకేజీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Aslo read-DAVOS : దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల పంట.. రూ.12,500 కోట్లతో రష్మి గ్రూప్ భారీ ప్లాంట్!
రూ.6,000 కోట్లతో న్యూక్లర్ సంస్థ విద్యుత్ ప్లాంట్: క్లీన్ ఎనర్జీలో సరికొత్త అధ్యాయనానికి పునాది పడింది. స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడి పెట్టనుంది. రూ. 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (SMR) ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు న్యూక్లర్ సంస్థ ముందుకచ్చింది. దీని సామర్థ్యం 300 మెగావాట్లు. 2047 నాటికి ‘నెట్-జీరో’ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ప్రాజెక్ట్ కీలకం కానుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో తొలి బ్యూటీ-టెక్ జీసీసీ: ప్రపంచ సౌందర్య సాధనాల దిగ్గజం లోరియల్, తన మొట్టమొదటి గ్లోబల్ బ్యూటీ-టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ. 3,500 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ బ్యూటీ-టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఏఐ నిపుణులు, డేటా సైంటిస్టులు సహా 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. నవంబరులో ప్రారంభం కానున్న ఈ హబ్, ‘భారత్ నుంచి ప్రపంచం కోసం’ (India for the World) అనే నినాదంతో పనిచేస్తుంది.
Also read-Davos: సీఎం ఆహ్వానం.. ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన చిరంజీవి
సర్గాడ్ (Surgad): ఏవియేషన్ రంగంలో విస్తరణ: అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ విమానయాన రంగంలో మరమ్మతులు, నిర్వహణ (MRO) యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రూ. 1,000 కోట్ల పెట్టుబడితో (దశలవారీగా) ఏర్పాటు కానుంది. తెలంగాణను ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
ఏబీ ఇన్ బెవ్ (AB InBev) విస్తరణ: ప్రపంచంలోనే అతిపెద్ద బీరు తయారీ సంస్థ ఏబీ ఇన్ బెవ్, తెలంగాణలో ఉన్న తన ప్రస్తుత యూనిట్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల అదనపు పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. జనవరి 23 వరకు కొనసాగనున్న ఈ సదస్సులో మరిన్ని కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.

