RTC Bus Accident in Ranga Reddy: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం.
చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈ ఘటన జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 70 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఆ సమయంలో కంకరతో వెళ్తున్న టిప్పర్ వేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టింది. కంకర పడిపోవడంతో బస్సులోని ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు స్థానికులు చేపట్టారు.
ఘటనాస్థలిలో జేసీబీతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల-వికారాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి ట్రాఫిక్ అధికారులు రోడ్డును క్లియర్ చేసే పనిలో ఉన్నారు. నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి: చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.




