RTC Bus Hits Lorry: విశాఖపట్నంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గాజువాక సమీపంలోని శ్రీనగర్ వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని .. ఆర్టీసీ (APSRTC) బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
మిన్నంటిన ఆర్తనాదాలు: రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో రామభద్రాపురం వైపు వెళ్తోంది. బస్సు గాజువాక సమీపంలోని శ్రీనగర్ వద్దకు చేరుకునే సరికి.. రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని గమనించకుండా అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా ఆర్తనాదాలు మిన్నంటాయి. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
Also read-Mantralayam: ఘోర విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు!
సహాయక చర్యలు: ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని.. క్షతగాత్రులను బస్సు శిథిలాల నుంచి వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

