Samruddhi Expressway road accident : నవరాత్రి వేళ జగన్మాతను కొలువుదీర్చి వేడుక చేసుకోవాలన్న ఆ యువకుల కలలు క్షణాల్లో కల్లలయ్యాయి. ఉత్సాహంగా సాగిన ప్రయాణంలో మృత్యువు మాటువేసి కాటేసింది. పండుగ శోభ వెల్లివిరియాల్సిన పల్లెల్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ధమన్‌గావ్ సమీపంలో గల సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే ఛానల్-97 వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వర్ధా జిల్లా సిందీ మేఘే ప్రాంతానికి చెందిన యువకులు నవరాత్రోత్సవాల కోసం షేగావ్‌లో దుర్గాదేవి ప్రతిమను తీసుకొని బొలెరో పికప్ వాహనంలో తిరుగుపయనమయ్యారు. వాహనం ధమన్‌గావ్ సమీపిస్తుండగా, వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన ఓ కంటైనర్ ట్రక్కు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఢీకొన్న ధాటికి వాహనం నుజ్జునుజ్జయి, ఏడుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 19 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ధమన్‌గావ్ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం వర్ధాకు తరలించారు. అమరావతి రూరల్ ఎస్పీ నికేతన్ కదం సహాయక చర్యలను పర్యవేక్షించారు. మితిమీరిన వేగమే ఈ విపత్తుకు కారణమని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు, ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

