Saralamma: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ వనజాతర బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. జాతర తొలిరోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చే కీలక ఘట్టంతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి. లక్షలాది మంది భక్తులు ఎడ్లబండ్లు, వాహనాల్లో తరలివచ్చి వనదేవతలకు జేజేలు పలికారు.
కన్నెపల్లి నుంచి కదలివచ్చిన తల్లి: బుధవారం ఉదయం కన్నెపల్లిలోని ఆలయంలో ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు రంగురంగుల ముగ్గులతో అమ్మవారికి స్వాగతం పలికారు. రాత్రి 7:40 గంటల సమయంలో సారలమ్మను ఆలయం వెలుపలకు తీసుకువచ్చే సమయంలో భక్తి పారవశ్యం మిన్నంటింది. శివసత్తుల పూనకాలు, ఆదివాసీల నృత్యాలు, కొమ్ము బూరల ధ్వనుల మధ్య వాతావరణం ఆధ్యాత్మికతతో నిండిపోయింది.
అమ్మవారికి ఆహ్వానం: మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ములుగు కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అధికారికంగా అమ్మవారికి ఆహ్వానం పలికారు. భక్తులు వరం పడుతూ పొర్లుదండాలు పెడుతుండగా.. వారి పైనుంచి పూజారులు వెదురుబుట్టలో ఉన్న అమ్మవారిని తీసుకువెళ్లడం యావత్ భక్తజెనానికి ఆనందాన్ని నింపింది.
Also read-Medaram : మేడారం మహాజాతర: అడవి తల్లుల ఆక్రందన.. గిరిజన ఆత్మగౌరవ పోరాట చరిత్ర!
అర్ధరాత్రి గద్దెలపై ప్రతిష్ఠ: కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ… జంపన్నవాగును దాటుకుంటూ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి ముగ్గురు దేవతలకు ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం అర్ధరాత్రి దాటాక అత్యంత వేడుకగా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ మహాక్రతువును తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు.
కట్టుదిట్టమైన భద్రత: భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో 13 వేల మంది పోలీసులు, ఇతర శాఖలకు చెందిన 40 వేల మంది సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయం నుంచి హై ఫ్రీక్వెన్సీ వాకీటాకీ ద్వారా మేడారం ట్రాఫిక్ విధులను పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

