Saraswati pushkaralu: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు నేడు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 5.43 నిమిషాలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు సంయుక్తంగా పుష్కరాలను ప్రారంభించారు. జూన్ 1వ తేదీ వరకు ఈ పుష్కరాలు కొనసాగనున్నాయి.
భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ అంత్య పుష్కరాల కోసం రూ. 30 కోట్ల నిధులను మంజూరు చేసింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నదీ తీరానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరం పరిసర ప్రాంతాల నుంచి నదీ తీరానికి వచ్చే మార్గాల్లో రోడ్లను అభివృద్ధి చేశారు. పార్కింగ్ కోసం 250 ఎకరాలను సమీకరించారు. వాహనాల రద్దీ పెరిగితే దూరప్రాంతాల్లో నిలిపివేసి.. అక్కడి నుంచి భక్తులను ఉచిత బస్సుల ద్వారా నది వద్దకు చేరవేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అంతేకాకుండా నదీ తీరంలో భారీ టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. విరివిగా తాగునీటి కేంద్రాలను అందుబాటులో ఉంచారు.
మహిళల కోసం గదులు: సరస్వతీ ఘాట్‌తో పాటు ప్రధాన ఘాట్ వద్ద భక్తులు దుస్తులు మార్చుకోవడానికి వీలుగా 300కు పైగా తాత్కాలిక గదులను నిర్మించారు. నదిలో ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పుష్కరాల సందర్భంగా ప్రత్యేకంగా ఒక మ్యూజియాన్ని నిర్మించారు. అలాగే జూన్ 1 వరకు ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నదికి ఘనంగా హారతి ఇవ్వనున్నారు.
Also read-Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. క్యూలైన్ మూసివేత!
అంత్య పుష్కరాల విశిష్టత: ప్రాణహిత, గోదావరి నదులతో పాటు సరస్వతి నది అంతర్వాహిణిగా ప్రవహిస్తూ కాళేశ్వరం త్రివేణి సంగమంగా భాసిల్లుతోంది. భారతదేశంలో అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) తర్వాత సరస్వతి నది ఉన్న ఏకైక క్షేత్రం కాళేశ్వరమే కావటం ఇక్కడి ప్రత్యేకత. సాధారణంగా ఆది పుష్కరాల్లో నదీ స్నానం ఆచరించి పితృతర్పణాలు ఇస్తే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో.. అంత్య పుష్కరాల్లోనూ అదే స్థాయి ఫలితాలు వస్తాయని పండితులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

