Sunday, January 18, 2026
HomeTop StoriesElections: హస్తానిదే హవా.. సగానికి పైగా సర్పంచి స్థానాల్లో విజయదుందుభి!

Elections: హస్తానిదే హవా.. సగానికి పైగా సర్పంచి స్థానాల్లో విజయదుందుభి!

Panchayat election results: రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. మొత్తం 4,333 స్థానాలకు గాను సగాని కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుని తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. అర్ధరాత్రి 12:30 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవాలతో కలిపి 2,297 స్థానాలు (51.9%) దక్కించుకున్నారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్‌ మినహా మిగిలిన 27 జిల్లాల్లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులే మెజారిటీ స్థానాలను గెలుచుకున్నారు. ఇందులో నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నిజామాబాద్‌ వంటి ప్రధాన జిల్లాలు ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి, ములుగు, మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది.

- Advertisement -

హోరాహోరీ పోరులో రెండో స్థానంలో బీఆర్‌ఎస్‌: ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చింది. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్‌ జిల్లాల్లో మొదటి స్థానంలో నిలవగా మిగితా జిల్లాల్లో రెండో స్థానంలో నిలిచింది. బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 1,191 స్థానాలు (27.5%) గెలుచుకున్నారు. 27 జిల్లాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా మిగితా జిల్లాల్లో బీఆర్ఎస్‌ మద్దతుదారులే ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/telangana-panchayat-elections-2025-results-twists-mlas-setback/

బీజేపీ ఖాతాలో నిర్మల్ జిల్లా: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుదారులు నిర్మల్‌ జిల్లాలో మెజారిటీ స్థానాలను సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మద్దతుదారులకు 257 స్థానాలు (6.2%) లభించాయి. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

85.86% పోలింగ్ నమోదు: వణికించే చలిని సైతం లెక్కచేయకుండా పల్లె ప్రజలు పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సెలవు రోజు కావడంతో ఓటర్లలో ఉత్సాహం మరింత పెరిగింది. మొదటి విడతలో 84.28 శాతం ఓటింగ్‌ నమోదు కాగా ఈ సారి 1.58% ఎక్కువగా నమోదైంది. రెండో విడతలో 85.86 శాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.71% మంది ఓటు వేశారు. మొత్తం 54,40,339 ఓటర్లకు గాను 46,70,972 మంది ఓటు వేశారు. వీరిలో మహిళా ఓటర్లే (23,93,010) అధికంగా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పలుచోట్ల తక్కువ మెజార్టీలతో ఉత్కంఠభరితంగా ఫలితాలు వెలువడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మాడ్గులపల్లిలో 96 ఏళ్ల గోలి వెంకటమ్మ ఉత్సాహంగా ఓటు వేయడం ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News