Shabbir Ali: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ అలజడి రేగింది. కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీగా మారిందంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడిన సంచలన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసభ్యకరమైన పనులు చేస్తేనే పదవులు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక ముఖ్య కాంగ్రెస్ నాయకుడితో షబ్బీర్ అలీ ఫోన్‌లో మాట్లాడినట్లు ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ సంభాషణలో కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమ్ముడుపోయే పార్టీగా తయారైంది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని.. పైసలు ఇచ్చిన వాళ్లకే పార్టీ పదవులు దక్కుతున్నాయి” అని షబ్బీర్ అలీ అన్నారు. అంతేకాకుండా అసభ్యకరమైన పనులు చేసిన వాళ్లకే పార్టీ పదవులను ఇస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

