Sentiment Politics: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ చుట్టూ నడిచిన హైడ్రామాతో.. సెంటిమెంట్ రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. జనసేన వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితులు మారాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.
చివరి నిమిషంలో ప్రెస్ మీట్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ.. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పవన్ కల్యాణ్ భావించారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు దానికి అనుమతి నిరాకరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన శ్రేణులు హైకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త దుమారాన్ని లేపాయి.
కాంగ్రెస్ టార్గెట్‌గా పవన్ వ్యాఖ్యలు: ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్ నేరుగా కాంగ్రెస్ పార్టీని ఎక్కుపెట్టినట్లు తెలుస్తోంది. ఓ వైపు ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతునే.. మరోవైపు రేవంత్ సర్కార్ విధానాలను టార్గెట్ చేశారు. అయితే ఈ తరుణంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించేలా ఉన్నాయి. దీంతో తెలంగాణ వాదులు సైతం పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పొరుగురాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉండి.. తెలంగాణ గడ్డపై ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్లీ సెంటిమెంట్ పాలిటిక్స్‌కు ఊతం ఇచ్చాయి. పవన్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.. కౌంటర్ అటాక్ చేశారు. దీంతో ఈ వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం: ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. హరీశ్‌రావు, కేటీఆర్ వంటి అగ్రనేతలు ఎవరూ ఇప్పటివరకు ఈ విషయంపై బహిరంగంగా స్పందించలేదు. అధినేత కేసీఆర్ ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే స్పందించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే తనదైన వ్యూహాలతో ముందుకెళ్లే గులాబీ బాస్.. ఈ ప్రాంతీయ వివాదంపై ఎలా స్పందింస్తారనేది ఆసక్తిగా మారింది.
జనసేన కేడర్‌లో కొత్త ఉత్సాహం: విమర్శల సంగతి ఎలా ఉన్నా పవన్ కల్యాణ్ తన ప్రెస్ మీట్ ద్వారా పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై కీలక ప్రకటన చేశారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తానే స్వయంగా తెలంగాణ అంతటా పర్యటిస్తానని ప్రకటించడంతో ఇక్కడి జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

