Ebola virus: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఎబోలా వైరస్ కలకలం రేపింది. సుడాన్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి గతంలో ఎబోలా సోకినట్లు విమానాశ్రయ అధికారులు గుర్తించారు.
స్కానర్‌లో దొరికిన ప్రయాణికుడు: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసింది. సుడాన్‌కు చెందిన మహమ్మద్ అనే ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. అతనికి గతంలో ఎబోలా వైరస్ సోకినట్లు వైద్య రికార్డుల ద్వారా అధికారులు నిర్ధారించారు.
గాంధీ ఆసుపత్రికి తరలింపు: వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు.. సదరు ప్రయాణికుడిని దేశంలోకి అనుమతించకుండా తక్షణమే అతన్ని గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. శాంపిల్స్ సేకరించి సీసీఎంబీకి పంపించినట్టు గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విమానాశ్రయంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్క్రీనింగ్ నిర్వహించడం వల్లే ఈ ముప్పు తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టులో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.

