Governor Shiv Pratap Shukla: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బాధ్యతలు స్వీకరించారు. లోక్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్.. నూతన గవర్నర్‌తో ప్రమాణం చేయించారు.
తెలుగులో ప్రమాణ స్వీకారం: గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణం చేసి తీరు అందరినీ ఆకట్టుకుంది. తన బాధ్యతలను అత్యంత శ్రద్ధతో, నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని తెలుగులో ప్రమాణం చేయడంతో ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో లోక్ భవన్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రమాణ స్వీకారానికి ముందు వందేమాతరం, ముగింపులో జనగణమన గీతాలను ఆలపించారు.
Also read-KTR: “దానం, కడియంలకు క్లీన్‌చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై దాడి”
జిష్ణుదేవ్ వర్మ స్థానంలో శివప్రతాప్: గతంలో ఇక్కడ గవర్నర్‌గా పనిచేసిన జిష్ణుదేవ్ వర్మను రాష్ట్రపతి మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేయడంతో.. ఆయన స్థానంలో శివప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. అయితే శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు ఇతర మంత్రులు , టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం హాజరయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారు.

