Singareni: సింగరేణి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే మైలురాయి ఆవిష్కృతమైంది. ఒడిశా రాష్ట్రంలోని సింగరేణికి చెందిన నైనీ బొగ్గు గని నుంచి తొలి బొగ్గు రైలు విజయవంతంగా తెలంగాణకు చేరుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (STPP) ఈ బొగ్గు రైలు చేరుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ తొలి రైలులో మొత్తం 59 వ్యాగన్ల ద్వారా 4వేవ టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గును తరలించారు.
ఘన స్వాగతం పలికిన అధికారులు: ఒడిశా నుంచి ఎస్టీపీపీ ప్రాంగణానికి చేరుకున్న తొలి బొగ్గు రైలుకు సంస్థ డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ మరియు ఎం. తిరుమల రావు ఘన స్వాగతం పలికారు. ఈ చారిత్రక కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడీ, జీఎం, వివిధ గుర్తింపు మరియు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, అధికార సంఘ ప్రతినిధులు, ఉద్యోగులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also read-Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2026.. అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు
హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం భట్టి: ఈ చారిత్రక ఘట్టం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యానికి, అధికారులకు, కార్మికులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇది సింగరేణి చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టమని అభివర్ణించారు. నైనీ గని ద్వారా భవిష్యత్తులో విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు మరింత సజావుగా బొగ్గు సరఫరా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

