Road accidents: రాష్ట్రంలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కామారెడ్డి జిల్లాలో బైక్ లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించగా.. హైదరాబాద్‌లో కారు బీభత్సానికి మరో ముగ్గురు విద్యార్థులు బలయ్యారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఒక ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వ్యక్తులు సచిన్, అశోక్, నాగులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also read-Heart attack: జగిత్యాలలో విషాదం.. గుండెపోటుతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి!
హస్తినాపురంలో కారు బీభత్సం: హైదరాబాద్‌లోని సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద మితిమీరిన వేగంతో వచ్చిన కారు అరాచకం సృష్టించింది. తొలుత ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహావీర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు శివ, సందీప్ అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తోటి విద్యార్థుల మరణవార్త తెలుసుకున్న మహావీర్ కాలేజీ విద్యార్థులు ఘటనా స్థలానికి చేరుకుని భారీ ఆందోళన చేపట్టారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

