Skin care Tips for Youth: వయస్సు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, చర్మం వదులుగా తయారవ్వడం వంటి సమస్యలు రావడం సహజం. ఈ సమస్య సాధారణంగా 50 ఏళ్లకు పైబడిన వారిలో ఉంటుంది. కానీ, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, కాలుష్యం కారణంగా చాలా మందికి 30 ఏళ్ల నుంచే చర్మం ముడతలు పడి సమస్యగా మారుతుంది. యవ్వనంలోనే వృద్ధాప్యంలా ఉన్నట్లు కనిపిస్తారు. దీంతో, వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అలాంటి వారి కోసం అనేక ఆరోగ్య చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా చర్మం ఎప్పుడూ బిగుతుగా, యవ్వనంగా కనిపిస్తుంది. చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ స్కిన్ కేర్ పద్దతులను పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మీరు కూడా ముడతలు పడిన చర్మంతో ఇబ్బంది పడుతున్నట్లయితే.. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా చర్మాన్ని బిగుతుగా మార్చుకోవాలంటే.. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకునే కొన్ని ఆరోగ్య చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
మెరిసే చర్మం కోసం ఇలా చేయండి..
కొబ్బరి నూనె మసాజ్
యవ్వనంలోనే చర్మం వదులుగా తయారవ్వడం, ముడతలు పడటం ప్రారంభిస్తే.. కొబ్బరి నూనె ఒక చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల మీ చర్మంపై ముడతలు తగ్గి మొహం నిగనిగలాడుతుంది.
కలబంద జెల్
కలబందలోని జౌషధాలు చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడతాయి. చర్మాన్ని తేజోమంతంగా చేయడానికి కలబంద జెల్ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ ముఖానికి రాసుకోవడం వల్ల మీ స్కిన్‌టోన్ మెరిసిపోతుంది.
తేనె- నిమ్మరసం మిశ్రమం
తేనె, నిమ్మరసం మిశ్రమాన్ని చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, బిగుతుగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని వారానికి నాలుగు సార్లు అప్లై చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
గంధం ఫేస్ ప్యాక్
చర్మాన్ని బిగుతుగా, ముడతలు లేకుండా ఉంచడానికి గంధం, రోజ్ వాటర్ కలిపిన ఫేస్ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముడతలు లేని మొహం కోసం గంధాన్ని అప్లై చేయండి. ఇది చర్మ ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది.
గుడ్డులోని తెల్లసొన మాస్క్
చర్మాన్ని బిగుతుగా మార్చుకోవడానికి గుడ్డులోని తెల్లసొన మాస్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మాస్క్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు వేసుకోవడం వల్ల చర్మంలో చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. ఈ సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా వృద్ధాప్య లక్షణాలను తగ్గించి మెరిసే చర్మాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.


