Southwest monsoon: ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణలోకి ప్రవేశించాయి. సోమవారం నాడు రాష్ట్ర దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాలను ఇవి తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో ఈ రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం శాఖ అంచనా వేస్తుంది. దీనికి తోడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వానలు కురువనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 14 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది.
హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్‌గా ఎస్.స్టెల్లా: హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌గా ఎస్.స్టెల్లా బాధ్యతలు స్వీకరించారు. అమరావతి వాతావరణ కేంద్రం నుండి బదిలీపై ఆమె ఇక్కడికి వచ్చారు. కాగా ఇప్పటివరకు ఇక్కడ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన కె.నాగరత్న అమరావతికి బదిలీ అయ్యారు.

